రైతు బంధు ఎగవేత: రేవంత్ రెడ్డి పై విమర్శలు
రైతు బంధు చెల్లింపులు, రుణమాఫీ విషయంలో వాయిదాలు వేయడంతో రేవంత్ రెడ్డి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, రుణమాఫీ, రైతు బంధు చెల్లింపులు ఆలస్యం కావడం రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతుంది.
రుణమాఫీ, రైతు బంధు ఆలస్యం
ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ హామీ అమలులోకి రాకపోవడం రైతులకు తీవ్ర నిరాశను కలిగించింది. రైతులు తిరిగి అప్పులు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా, రైతు బంధు చెల్లింపులు కూడా ఆలస్యం కావడం రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది.
హరీష్ రావు మాట్లాడుతూ, “రైతు బంధు అమలు కాలేదు. ఎన్నికల ముందు 7500 రూపాయలు ఇస్తామన్నారు, కానీ ఇప్పటి వరకూ అది కూడా అందలేదు,” అని అన్నారు.
హరీష్ రావు కేసిఆర్ పాలన, కాంగ్రెస్ పాలన మధ్య తేడాను ఎత్తిచూపారు. కేసిఆర్ ఉన్నప్పుడు రైతులకు 24 గంటల కరెంట్, ఎరువులు సకాలంలో సరఫరా అయ్యాయి అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దిగజారిందని అన్నారు.
“కరోనా సమయంలో కూడా కేసిఆర్ రైతులకు రైతు బంధు ఇచ్చారు. కానీ ఇప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయంలో పూర్తిగా విఫలమైంది,” అని హరీష్ రావు అన్నారు. దసరాలోపు రైతులకు రుణమాఫీ, రైతు బంధు చెల్లింపులు చేయకపోతే రైతులతో కలిసి సచివాలయం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
రైతుల కోసం చేసిన హామీలు అమలు చేయకపోతే దసరా తరువాత రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉద్యమాలు రావడం ఖాయం అని హరీష్ రావు అన్నారు.