PaperDabba News Desk: 27 September 2024
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు ఏర్పడుతున్నాయి. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రెడ్ అలెర్ట్ తో పలువురు జిల్లాల్లో అప్రమత్తం
తెలంగాణలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు
గత కొద్ది రోజులుగా వరుసగా వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఇప్పటికే వర్షాలకు విసిగిపోయారు. ఈ సీజన్ లో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు నమోదవుతుండటంతో, ప్రజలు ఎండను చూడని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దోమల బెడద, ఆరోగ్య సమస్యలు
వర్షాల కారణంగా దోమల బెడద కూడా అధికమవడంతో, అనేక రకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఈ సీజన్ లో విషజ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలియజేసింది.
వాతావరణ హెచ్చరికలపై స్పందన
ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమవ్వాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సచివాలయం నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ చేసిన తాజా హెచ్చరికతో ప్రజలు మరింత ఆందోళనలో ఉన్నారు. వరసగా అల్పపీడనాలు ఏర్పడటం, దాని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు వర్షం అంటేనే భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది.
వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం, మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు ముప్పు నుండి కాపాడుకునేందుకు స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.