చత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తమ రాష్ట్రంలో నక్సలిజం సమస్యను మూడు సంవత్సరాల్లో పరిష్కరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… సీఎం విష్ణుదేవ్ సాయి నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు, నక్సలిజం సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని అయన స్పష్టం చేశారు.
ప్రధాన స్రవంతిలోకి నక్సలైట్లను తీసుకురావడమే లక్ష్యం
విజయ్ శర్మ మాట్లాడుతూ… నక్సలైట్లతో చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. “మూడేళ్లలో నక్సలిజం సమస్యను పరిష్కరిస్తామన్న విశ్వాసం నాకుంది. మరో మూడేళ్లలో ఇంద్రావతి ఒడ్డున ప్రశాంతంగా కూర్చోగలరు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం విష్ణుదేవ్ సాయి వంటి సమర్థమంతమైన నేతల నాయకత్వంలో ఇది సాధ్యమే” అని ఆయన అన్నారు.
తాజా నక్సలైట్ ఘటనకు ప్రభుత్వం స్పందన
బిజాపూర్ జిల్లాలో బుధవారం రాత్రి నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడు ఘటనలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మృతిచెందగా, నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, తుపాకీ పవర్‌తో నక్సలిజం అంతం కాదన్నారు. తాము అనేక అంశాలపై పనిచేస్తున్నామని, సమగ్ర విధానం అమలు చేస్తామన్నారు. నక్సలైట్లతో బేషరతుగా చర్చలు జరిపేందుకు సిద్ధమేనని, ఫోన్‌లో లేదా వీడియో కాల్ ద్వారా కూడా మాట్లాడుకోవచ్చన్నారు.