PaperDabba News Desk: 20 July 2024
సానిపాయ అటవీ ప్రాంతంలో 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఒకరిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్సు ఎస్పీ పి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ చెంచు బాబు సూచన మేరకు ఆర్ఐ (ఆపరేషన్స్) సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్ శుక్రవారం స్థానిక అటవీ శాఖ సిబ్బందితో కలసి సానిపాయ బేస్ క్యాంపు నుంచి రాయవరం మీదుగా ఆవుల దారి, సరస్వతి కటువ, ముదుంపాడు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేసుకుంటూ వెళ్లారు.
స్వాధీనం వివరాలు మరియు అరెస్ట్
ఆపరేషన్ సమయంలో, టాస్క్ ఫోర్సు సిబ్బంది లోమోర నిషేధిత అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ వెళుతూ కనిపించారు. వారిని హెచ్చరించి చుట్టుముట్టగా, వారు దుంగలను పడేసి పారిపోసాగారు. అయితే టాస్క్ ఫోర్సు సిబ్బందిని వారిని వెంబడించి, ఒక వ్యక్తిని పట్టుకోగలిగారు. మిగిలిన వారు చిమ్మ చీకట్లో కలసి పోయారు. పట్టుకున్న వ్యక్తిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా అత్తిపట్టు, వీరప్పనూరు పంచాయితీకి చెందిన రమేష్ (32)గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి ఆ ప్రాంతంలో పడి ఉన్న 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తు కొనసాగుతున్నది
స్వాధీనం చేసిన దుంగలు మరియు అరెస్టు చేసిన వ్యక్తిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చారు. సీఐ సురేష్ కుమార్ ఈ కేసును నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన నిందితులను పట్టుకొని న్యాయస్థానంలో నిలిపేందుకు టాస్క్ ఫోర్సు సిబ్బంది ప్రయత్నిస్తున్నది.
అడవుల్లో ఎర్రచందనం అక్రమ వేటను అరికట్టడానికి టాస్క్ ఫోర్సు తన కట్టుదిట్టమైన చర్యలను కొనసాగిస్తూ, విలువైన ఎర్రచందనం వృక్షాలను రక్షించడానికి కృషి చేస్తున్నది.