PaperDabba News Desk: July 20, 2024
మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచి పోవడానికి గల కారణాల్ని గుర్తించారని, వీటి పరిష్కారానికి అప్డేట్స్ విడుదలయ్యాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్‌లో శుక్రవారం సాంకేతిక సమస్య తలెత్తింది. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది.
సాంకేతిక సమస్య పరిష్కార ప్రక్రియ
మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఇందుకు సంబంధించి ఎంఈఐటీవై (మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నిరంతరం మైక్రోసాఫ్ట్‌తో టచ్‌లో ఉందన్నారు. ఈ సాంకేతిక సమస్యకు కారణాలు గుర్తించినట్లు తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నెట్ వర్క్‌పై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. ఈ సమస్యకు సంబంధించి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సాంకేతిక సలహాలను జారీ చేస్తుందన్నారు.
బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్
కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించి, ఆ తర్వాత సిస్టంలు షట్ డౌన్ లేదా రీ-స్టార్ట్ అయ్యాయి. విండోస్ సరిగ్గా లోడ్ కాలేదు.. రీ-స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండని మెసేజ్ చూపించింది. ఈ ఎర్రర్‌తో ప్రపంచ వ్యాప్తంగా పలు సేవలపై ప్రభావం పడింది.
మైక్రోసాఫ్ట్ ప్రభావం పై మార్కెట్
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీపై మైక్రోసాఫ్ట్ అంతరాయం ప్రభావం లేదని ఎన్ఎస్ఈ ప్రకటించింది. వివిధ దేశాల స్టాక్ ఎక్స్చేంజీలపై ప్రభావం నేపథ్యంలో ఎన్ఎస్ఈ స్పందించింది. తమపై ఎలాంటి ప్రభావం లేదని బీఎస్ఈ కూడా ప్రకటించింది.
క్రౌడ్ స్ట్రయిక్ అప్ డేట్ కారణం
క్రౌడ్ స్ట్రయిక్ అప్ డేట్ కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధ్రువీకరించింది. క్రౌడ్ స్ట్రయిక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది.
ఈ సమస్య పరిష్కారం కోసం ఇంజినీర్లు పని చేస్తున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య పరిష్కారానికి అప్డేట్స్ విడుదల చేసినట్లు వెల్లడించారు. యూజర్లకు ఈ సమస్యల పరిష్కారం త్వరగా లభిస్తుందని ఆశిద్దాం.