హైదరాబాద్‌లో హైడ్రా: విపత్తుల నిర్వహణలో కొత్త అధ్యాయం

HYDRA: New Disaster Response System in Hyderabad

blockquote>PaperDabba News Desk: 13 July 2024

హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

హైడ్రా వ్యవస్థాగత నిర్మాణం మరియు విధి విధానాలు

హైడ్రా వ్యవస్థాగత నిర్మాణం, విధి విధానాలపై మరింత అధ్యయనం చేసి కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకొని మరింత సమర్థంగా హైడ్రా పని చేసేలా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

పాత్రలు మరియు బాధ్యతలు

కొత్త విభాగంలో ఏయే స్థాయి అధికారులుండాలి.. ఎంత మంది సిబ్బంది ఉండాలి.. ఏయే విభాగాలపై వీరిని డిప్యుటేషన్పై తీసుకోవాలి.. అనే అంశాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని, పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని సీఎం సూచించారు.

నిధుల కేటాయింపు మరియు చట్టపరమైన నిర్మాణం

అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలీ, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

హైడ్రా యొక్క ప్రధాన బాధ్యతలు

విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్తు సరఫరాలో హైడ్రా కీలకంగా వ్యవహరించేలా విధులు అప్పగించాలని సీఎం చెప్పారు.

శాఖల మధ్య సమన్వయం

హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్​మెంట్​, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించాలని అన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలని సూచించారు.

మొత్తానికి, హైడ్రా వ్యవస్థ ఏర్పాటుతో హైదరాబాద్‌లో విపత్తుల నిర్వహణ మరియు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. సరైన నిర్మాణం, సమన్వయం మరియు నిధులతో, హైడ్రా హైదరాబాద్ వాసులకు భద్రత మరియు నిలకడైన సేవలను అందించడానికి కీలకంగా మారుతుంది.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version