PaperDabba News Desk: July 15, 2024
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి మెరుగు నాగార్జున.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసింది శ్వేతపత్రం కాదు… అబద్దాలతో కూడిన నిందల పత్రం : మాజీ మంత్రి మెరుగు నాగార్జున.
దసపల్లా భూములపై చంద్రబాబు దుష్ప్రచారం
చంద్రబాబు ఆస్థానమీడియా, ఆయన నిరంతరం దసపల్లా భూములపై దుష్ప్రచారం చేసారు. ఈ భూముల విషయంలో వాస్తవాలను దాచేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దసపల్లా భూములు ప్రభుత్వానివి కావని, ఇప్పటికే కోర్టులు చెప్పాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. అయినా సరే ఇంకా దాన్ని పట్టుకుని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడు.
గీతం కాలేజీ అక్రమాలు
ఇన్ని మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు మరి గీతం కాలేజీ అక్రమాల విషయంలో అసలు ఎందుకు మాట్లాడ్డం లేదు? 38.6 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా గీతం వర్సిటీ ముసుగులో మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి స్వాహా చేసేశారు. వందల కోట్ల విలువైన ఈ భూమి టీడీపీ నాయకులు కబ్జాలో ఉన్నప్పటికీ అప్పట్లో చంద్రబాబు నోరు మెదపలేదు. వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కబ్జాలపై గట్టి చర్యలకు దిగింది. మొత్తం గీతం ఆక్రమణలో ఉన్న 24.13 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. కోర్టు స్టే వల్ల మిగిలిన భూముల స్వాధీన ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.
ఇళ్ల పట్టాలపై నిరాధార ఆరోపణలు
వైయస్సార్‌సీపీ ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపైనా చంద్రబాబువి నిరాధార ఆరోపణలు. చంద్రబాబు తన హయాంలో ఒక్కటంటే ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా, కనీసం సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. వైయస్.జగన్ ప్రభుత్వంలో 28వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాల రూపంలో ఇవ్వగా, మరో 25వేల ఎకరాల భూమిని అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేసి ఇళ్లపట్టాలు ఇచ్చాం.
చంద్రబాబు పరిపాలనలో తేడాలు
చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడైనా ఇలా పేదలను ఆదుకున్నారా? ఆదుకోకపోగా కేసులు వేసి అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఎన్నికల్లో గెల్చిన రోజు నుంచి ఎక్కడా అడ్డూ అదుపు లేకుండా, ఎక్కడ పడితే అక్కడ, యథేచ్ఛగా ఇసుకను దోచుకున్నారు. ఇవాళ ఇసుక ఉచితం అని చెప్పి, ఆర్భాటంగా కార్యక్రమాన్ని మొదలు పెట్టి.. సీనరేజ్, రవాణా ఛార్జీల పేరుతో ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
అక్రమ తవ్వకాలు
వంశధారను మింగేసింది ఎవరు? నాగావళిని దోచుకున్నది ఎవరు? గోదావరిని పిండేసింది ఎవరు? కృష్ణా నదీ గర్భాన్ని కొల్లగొట్టింది ఎవరు? పెన్నాను దోచుకున్న గజదొంగలు ఎవరు? ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ అక్రమాలు జరిగాయి.
పారదర్శకత
మా హయాంలో ప్రతి ఒక్కటీ పారదర్శకంగా చేశాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లాట్ ఫాంమీద టెండర్లు ఆహ్వానించాం. ఇసుక సరఫరాలో మా విధానం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.765 కోట్లు.. ఐదేళ్లలో రూ.3825 కోట్లు ఆదాయం. మరి గత మీ ఐదేళ్ల చంద్రబాబు పరిపాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడి వెళ్లాయి? ఎవరి జేబులోకి వెళ్లాయి చంద్రబాబు?
ఖనిజాలు మరియు ఆదాయం
దశాబ్దాలుగా గనులను దోచుకుని, అడ్డగోలుగా సంపాదించింది నీ మనుషులే చంద్రబాబు. మీ హయాంలో మైన్స్‌పై ఆదాయంలో పెరుగుదల (సీఏజీఆర్) 17శాతం నమోదైతే, మా హయాంలో అది 40 శాతం వరకు ఉంది.
ల్యాండ్ రీసర్వే మరియు టైట్లింగ్ యాక్ట్
ల్యాండ్ రీసర్వే, టైట్లింగ్ యాక్ట్‌ల గురించి కూడా చంద్రబాబు చాలా అవహేళనగా, తప్పుడు మాటలు కూడా మాట్లాడారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ అది సరైంది కాదని మీరు అనుకుంటే, అదే విషయాన్ని కేంద్రానికి చెప్పి, రద్దు చేయించవచ్చు కదా? దీనిపై మీరు ప్రధానమంత్రిగారితో మాట్లాడి, ఆయన్ను ఒప్పించి, చట్టాన్ని రద్దు చేయించవచ్చు కదా?
సూటిగా ప్రశ్నలు
వీటన్నింటికీ సమాధానం చెప్పే ధైర్యం నీకుందా: సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి మెరుగు నాగార్జున.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని… అబద్దాలతో కూడిన నిందల పత్రమని మాజీ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపడంతో పాటు అనరాని మాటలు అనడానికే ఈ తంతును కొనసాగించారని ఆయన అభిప్రాయపడ్డారు.
గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అత్యంత దారుణంగా పొగరు, కొవ్వు, ఉన్మాదం, మదము, అహంకారం వంటి పదజాలం వాడటంపై నాగార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న బాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరానికి అకౌంట్‌బులిటీ ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని సూచించారు. శ్వేతపత్రంలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి అంశం వారికి సంబంధించినవే ఉన్నాయన్నారు. దశాబ్దాలుగా దోపిడీకి పాల్పడినవారు, మోడస్ ఆపరెండీలో వ్యవస్ధలను చేజిక్కించుకున్నవాళ్లు, వ్యవస్ధీకృత కబ్జాలకు పాల్పడినవారికి సంబంధించినవే ఇవాళపూర్తిగా కనిపిస్తుంటే.. ఇవాళ ఆయనే నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. గంటలతరపడి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు వాటికి సంబంధించి చివరకి ఒక్క ఆధారాన్ని చూపలేకపోయారన్నారు. వారి ఆస్ధాన మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ నడిపిన వార్తలే శ్వేతపత్రాల్లోని అంశాలుగా విడుదల చేయడమంటే… వారిది ఎంత దుర్లభమైన పరిస్థితో అర్ధం చేసుకోవాలన్నారు.
తాను చెప్పిన విషయాలు రికార్డుల్లో లేవని, ఎవరో చెప్పిన సమాచారం ఇస్తున్నామని, వాస్తవాలు ఎగ్జిక్యూట్ చేయలేమంటూనే.. అధికారులు కూడా కంపెల్ చేయలేకపోతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడంతో ఈ శ్వేతపత్రం వెనుక ఉన్న అసలు రంగు బట్టబయలైందని మెరుగు నాగార్జున తేల్చి చెప్పారు. ఖనిజాలు, భూములు, సహజవనరులు, గృహనిర్మాణం, ల్యాండ్ టైటిలింగ్ వంటి అంశాలపై చర్చించారని… ఇందులో భాగంగా విశాఖపట్నం దసపల్లా భూముల్లో ఏదో జరిగిందన్నట్టు చంద్రబాబు నాయుడు ఆస్దాన మీడియా నిరంతరం దుష్ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే అవి ప్రభుత్వ భూములు కాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. ఆ వ్యవహారంలో త్వరగా నిర్ణయం తీసుకుని కోర్టుకు సమర్పించాలని హైక్టోరు కూడా చెప్పిందన్నారు.