పోలీసులకు పరిధి పంచాయితీ- కన్నవారిది కడుపుకోత- రెండురోజులుగా ఏట్లో మృతదేహం!

పోలీసులకు పరిధి పంచాయితీ- కన్నవారిది కడుపుకోత- రెండురోజులుగా ఏట్లో మృతదేహం!
                            <strong>Nandyal News:</strong> కళాశాలకు అని వెళ్లిన కుమారుడు తిరిగి రాలేదు. తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేశారు. బంధువుల్లో కూడా ఆరా తీశారు. అయినా ఎలాంటి చప్పుడూ లేకపోవడంతో... పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఓ కాలువలో ఓ మృతదేహం లభించింది. అది కూడా ఓ అబ్బాయిది. మీరోసారి వెళ్లి చూడండి.. మీ వాడిదేనోమో అని పోలీసులు చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లారా తల్లిదండ్రులు. కానీ ఆ మృతదేహం బోర్లా ఉండడంతో ఆ తల్లిదండ్రులు అది తమ కుమారుడి శవమేనా కాదా అనే అనుమానం వస్తోంది. కుమారుడు ఇంటి నుంచి వెళ్లేటప్పుడు నీలం రంగు చొక్కానే వేస్కోవడం, మృతదేహంపై కూడా అదే రంగు చొక్కా ఉండడంతో.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని బయటకు తీయాల్సిన పోలీసులు మాత్రం తమ పరిధిలోకి రాదంటే.. తమ పరిధిలోకి రాదని చెప్తూ.. రెండ్రోజుల నుంచి మృతదేహాన్ని అలాగే వదిలేశారు. పోలీసులు వస్తే తప్ప మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం లేక కాలువ గట్టుపై కూర్చొనే తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

ఈనెల 21వ తేదీ నుంచి యువకుడి అదృశ్యం..

కర్నూలుకు చెందిన డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి ఒకరు ఈనెల 21వ తేదీ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు రెండ్రోజుల పాటు వెతికారు. స్నేహితులు, బంధువుల అందరికి ఫోన్లు చేశారు. అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో ఈనెల 23వ తేదీన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోతిరెడ్డిపాడు వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని.. ఓసారి చూసి రండంటూ పోలీసులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మూడో గేటు వద్ద నీటిపై తేలిన ఈ యువకుడి మృతదేహంపై నీలి రంగు చొక్కా ఉంది. అప్పటికే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సమీపంలోని పాములపాడు స్టేషన్ సిబ్బంది వచ్చి చూసి ఇది జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి వెళ్లిపోయారు. వాళ్లొచ్చి పాములపాడు ఠాణాకే చెందుతుందని చెప్పారు. ఇలా ఒకరిపై ఒకరు వంతులేసుకొని మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

మృతదేహం కుళ్లిపోక ముందే వెలికి తీయాలి..News Reels

మృతదేహాన్ని వెలికి తీయించి ఉంటే ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు తెరరపడేది. కుమారుడు కనిపించ లేదని కొంత.. చనిపోయాడో ఏమో అనే బెంగతో మరికొంత వారు ఏటి గట్టు మీదే కూర్చొని కుమిలిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు చొరవ తీసుకుని మృతదేహం పూర్తిగా కుళ్లిపోక ముందే బయటకు తీయాలని స్థానికులు కోరుతున్నారు. అయినా ప్రజలకు సాయంగా నిలవాల్సిన పోలీసులు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదని వెళ్లిపోవడం సరైన పద్దతి కాదని అంటున్నారు. ఎవరిదైనా సరే ముందు మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేయాలని చెబుతున్నారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తేనే.. ప్రజలకు వారి పట్ల నమ్మకం ఉంటుందని వివరిస్తున్నారు. మరి చూడాలి.. పోలీసులు ఇప్పటికైనా స్పందించి మృతదేహాన్ని బయటకు తీస్తారో, లేదో. 

ఇవి కూడా చదవండి   మద్దతు ధర ఇచ్చి మరీ గడ్డి కొంటారట, హరియాణా ప్రభుత్వం నిర్ణయం!