మోదీకి కొత్త అర్థాన్ని తీసిన వెంకయ్య నాయుడు

మోదీకి కొత్త అర్థాన్ని తీసిన వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కొంత విరామం తరువాత వార్తల్లోకి ఎక్కారు. ఉప రాష్ట్రపతిగా పదవీ కాలం ముగిసిన అనంతరం కొంతకాలం పాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. విదేశీ పర్యటనకూ వెళ్లొచ్చారు. మళ్లీ రాజకీయాల్లోకి పునఃప్రవేశించే అవకాశం లేదని ఆయన అప్పట్లోనే వెల్లడించారు. ప్రజా జీవితంలో తన ప్రయాణం కొనసాగుతుందని, రాజకీయాలతో పాటు అన్ని అంశాలపై స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడిస్తానంటూ చెప్పారు.

కొంత విరామం తరువాత ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. తాజాగా కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2019 మేలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా రెండోసారి బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి 2020 మే వరకు వివిధ సందర్భాలు, వేదికలపై ప్రసంగించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కాలం కావడం వల్ల టీవీల్లోనూ తరచూ కనిపించే వారు.

అలాంటి వాటిల్లో ఎంపిక చేసిన ప్రసంగాలతో రూపొందించిన పుస్తకం ఇది. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్- ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్పీక్స్ అనే పేరు పెట్టారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేరళ గవర్నర్ మహ్మద్ ఆరిఫ్ ఖాన్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 86 ప్రసంగాలు ఇందులో ఉన్నాయి. 10 అంశాల వారీగా దీన్ని విభజించారు.

ఆత్మనిర్భర్ భారత్, ఆర్థిక వ్యవస్థ, సుపరిపాలన, కరోనా మహమ్మారిపై పోరాటం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు, టెక్ ఇండియా-న్యూఇండియా, జైకిసాన్, గ్రీన్ ఇండియా-క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా-ఎఫీషియంట్ ఇండియా, ఎటర్నల్ ఇండియా-మోడర్న్ ఇండియా, కల్చరల్ హెరిటేజ్, మన్ కీ బాత్.. వంటివి ఇందులో పొందుపరిచారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ బుక్ అందుబాటులో ఉంటుంది. అమెజాన్, గూగుల్ ప్లే నుంచి కూడా ఈ బుక్‌ను ఆర్డర్ చేయవచ్చు.

దీన్ని ఆవిష్కరించడానికి ఆకాశవాణి భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. బుక్‌ను ఆవిష్కరించిన అనంతరం వెంకయ్య నాయుడు పలు అంశాలపై మాట్లాడారు. తనదైన శైలిలో ప్రాసలతో ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఉద్దేశాన్ని ఈ పుస్తకం తెర మీదికి తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి పథంలో నడిపించేలా ప్రధాని మోదీ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తోన్నారో.. అమలు చేస్తోన్నారో.. వాటన్నింటికీ ఇది అద్దం పట్టిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి   Tamilisai: తెలంగాణ చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.. గవర్నర్ తమిళి సై..

మోదీ అనే ఇంగ్లీష్ పదాలకు వెంకయ్య నాయుడు కొత్త అర్థం చెప్పారు. మోదీ అంటే మూవ్‌మెంట్ ఫర్ డెస్టినీ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. గతంలో భారత్ విశ్వగురుగా పేరు తెచ్చుకుందని, ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. ఈ ఎనిమిది సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని, ఆత్మనిర్భర్ భారత్ మూవ్‌మెంట్.. దేశ గతిని మార్చివేసిందని పేర్కొన్నారు. అనేక రంగాల్లో అగ్రగామిగా నిలవడానికి ఎంతో కాలం పట్టదని చెప్పారు.