రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్ధుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను వివరించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా రేయింబవళ్లు నిరంతరం పనిచేసి పెద్దఎత్తున సహాయ పునరావాస చర్యలు చేపట్టడం జరిగిందని సీఎం గవర్నర్ వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షించడం పట్ల గవర్నర్ అబ్ధుల్ నజీర్ సీఎంను ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ అబ్ధుల్ నజీర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.