PaperDabba News Desk: July 21, 2024
తెలుగు దేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలక్ట్రోరల్ ఓటమి తరువాత జగన్ ప్రవర్తనను ప్రశ్నిస్తూ, ఆయన నేరాలు, అక్రమాలు ప్రస్తావిస్తూ, ఆయనపై గట్టి విమర్శలు గుప్పించారు.
రాజకీయ ఓటమిపై జగన్ ప్రతిస్పందన
గంటా శ్రీనివాసరావు ‘ఎక్స్’ వేదికగా మాట్లాడుతూ… జగన్ ఓటమిని తట్టుకోలేకపోతున్నారని, త్వరగా నిరుత్సాహానికి గురవుతున్నారని అన్నారు. “40 రోజులు అధికారానికి దూరమైతేనే తట్టుకోలేకపోతున్నారా జగన్? మీ దోపిడీ పాలనకు విసుగు చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్ర ఎరుగని తీర్పు ఇచ్చారు. ఆ ఘోర పరాభవాన్ని గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారా?” అని ప్రశ్నించారు.
ఇంకా రెండు నెలలైనా కాలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడి, కానీ మీరు రాష్ట్రపతి పాలన పెట్టాలని అడుగుతున్నారు. మీ ఎంపీ గారు మధ్యంతర ఎన్నికలు పెడితే మళ్లీ అధికారంలోకి వస్తామని అంటున్నారు. ఇది పద్ధతేనా జగన్ ? అని ఘాటుగా విమర్శించారు.
అక్రమాలు, అవినీతి ఆరోపణలు
జగన్ పాలనలో జరిగిన అనేక అక్రమాలను గంటా శ్రీనివాసరావు ప్రస్తావించారు. కరోనా సమయంలో మాస్కు అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్‌ను వేధించటం, తూర్పు గోదావరి జిల్లాలో దళిత డ్రైవర్‌ను చంపిన ఎమ్మెల్సీ అనంత బాబు వంటి సంఘటనలను ఈ సందర్భంగా అయన ప్రస్తావించారు.
“మీ ఐదేళ్ల పాలన అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను వేధించి, అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న చరిత్ర మీదే” అని గంటా శ్రీనివాస రావు విమర్శించారు.
విజయనగరం నుంచి తాడేపల్లి వరకు జగన్ చేసిన ప్రయాణం గురించి గంటా ప్రస్తావిస్తూ… ఆయన వాహన మార్పును విమర్శించారు. “విజయనగరం నుంచి తాడేపల్లి వరకు 9 గంటలు నిరాటంకంగా ప్రయాణించిన మీరు… 10 నిముషాల్లోనే మీ సొంత వాహనంలోకి మారిపోతారు. ప్రజలు మీ ప్రవర్తనను గమనిస్తున్నారు” అని అన్నారు.
ప్రతిపక్షం పిలుపు
జగన్ ప్రజా నిబద్దత ఉంటే సమస్యలపై పోరాటం చేయాలని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. “ప్రజా సమస్యలపై పోరాడండి. ప్రజలు హర్షిస్తారు. ఓటమిని జీర్ణించుకోలేక కుట్ర రాజకీయాలకు తెర లేపితే ప్రజలు మిమ్మల్ని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తారు” అని హెచ్చరించారు.
గంటా శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు తీవ్రతను తెలియజేస్తున్నాయి.