డయేరియా నివారణకు తక్షణమే స్పెషల్ డ్రైవ్
మంచి నీటి పైప్ లైన్ ల లీకేజిలను 24 గంటల్లో అరికట్టాలి
రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ
పేపర్‌డబ్బా న్యూస్ డెస్క్ – జూన్ 28: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకై అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు తక్షణమే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మంచినీటి పైపుల్లో లీకేజి లు ఉంటే 24 గంటల్లో అరికట్టాలని, కాలువల్లో చెత్తాచెదారాన్ని జూలై మాసాంతానికి కల్లా తొలగించాలని ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దానికి తగ్గట్లుగా ముందస్తు నివారణ చర్యల కోసం ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని కమిషనర్లకు సూచించారు. ఇప్పటి వరకూ మున్సిపాల్టీల్లో ఎక్కడా డెంగ్యూ కేసులు రాలేదని, అక్కడక్కడా డయేరియా కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. దీనిపై వైద్యారోగ్యశాఖ అధికారులతో కూడా చర్చించినట్లు మంత్రి తెలిపారు. డయేరియా నివారణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, డ్రెయిన్ లలో సిల్ట్ తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలన్నారు. త్రాగునీటి సరఫరా పైపుల లీకేజీల నియంత్రణకు, కాలువల్లో చెత్తాచెదరాన్ని తొలగించి పారిశుద్య పరిస్థితులను మెరుగు పర్చేందుకు దాదాపు రూ.50 కోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
మున్సిపల్ కార్పొరేషన్ల కోసం చర్యా ప్రణాళిక
ఈ సమావేశంలో పాల్గొన్న కమిషనర్లు వారి కార్పొరేషన్లలో అమలు చేయబడుచున్న పలు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ల ఆర్ధిక పరిస్థితిని వివరించడంతో పాటు తాగునీరు సరఫరా మెరుగుకు, మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్దికి, డ్రెయిన్ లలో మురుగు తొలగింపుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ముందస్తు చర్యలపై మంత్రిగారి నిర్దేశనలు
సమావేశంలో మంత్రి నారాయణ సీజనల్ వ్యాధుల, ముఖ్యంగా డయేరియా నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మంచినీటి సరఫరాను మెరుగుపరచడం ద్వారా పైపుల లీకేజీలను తక్షణమే అరికట్టడం, ప్రజా ప్రదేశాల్లో పరిశుభ్రతను కాపాడడం ద్వారా వ్యాధుల ప్రబలింపును నిరోధించడం ఎంతగానో అవసరమని అన్నారు.
పరిశుభ్రత మెరుగుకు నిధుల విడుదల
మంత్రి నారాయణ త్వరలో రూ.50 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ నిధులు నీటి పైపుల లీకేజీలను అరికట్టడానికి, కాలువల్లో చెత్తను తొలగించి పరిశుభ్రతను మెరుగుపర్చడానికి ఉపయోగపడతాయి.