PaperDabba News Desk: 22 July 2024
2024 పార్లమెంట్ ఎన్నికలలో దేశ వ్యతిరేక శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు,కుట్రలు చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని అయన అన్నారు. హైదరాబాద్ జిల్లా కార్యకర్తల విసృతస్థాయి సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
మోడీ మూడోసారి ప్రధానమంత్రి
పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత మోడీదేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌లో బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు హక్కులు కల్పించిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్‌పై ఆరోపణలు
కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అనేకసార్లు అవమానించిందని, అధికారం, ఎన్నికలతో సంబంధం లేకుండా సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేస్తుందని, ఎన్నికల్లో ఓడిపోవడంతో అసహనంతో ఆ పార్టీ వ్యవహరిస్తుందని అన్నారు.
ఉగ్రవాదం అణచివేసిన ఘనత
దేశంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా అణచివేసిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి పెరిగాయని కిషన్ రెడ్డి చెప్పారు. బొగ్గు కుంభకోణం, కామన్ వెల్త్ కుంభకోణం, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం వంటి అనేక కుంభకోణాలతో సుమారు రూ.12లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కిషన్ రెడ్డి ఆరోపించారు.
మోడీ ప్రభుత్వం దేశంలో అభివృద్ధి పరంగా అనేక మార్పులు చేసిందని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.