PaperDabba News Desk: అక్టోబర్ 3, 2024
అమరావతి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన జీఎస్డీపీ సమీక్షలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవల రంగాలలో వృద్ధి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దృష్టి పెట్టారు.
గత ప్రభుత్వ విధ్వంసకర విధానాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని, ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పడిపోయిందని ఆయన విమర్శించారు. నూతన విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. ప్రజలపై అదనపు భారం వేయకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధానాలను అమలు చేయడం ముఖ్యమని అన్నారు.
వివిధ శాఖలు తమదైన విధానాల ద్వారా ప్రజల ఆదాయాలను పెంచేందుకు కృషి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. “పథకాలు అందించడం మాత్రమే కాక, ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడమే ముఖ్యమని” అన్నారు. 2014-2019 మధ్య ఎపి 13.7 శాతం వృద్ధి రేటు సాధించిందని, కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రేటు 10.59 శాతానికి తగ్గిందని చెప్పారు.
2019 నాటికి తెలంగాణ, ఎపి మధ్య జీఎస్డీపీలో 0.20 శాతం వ్యత్యాసం మాత్రమే ఉన్నప్పటికీ, 2024 నాటికి ఈ వ్యత్యాసం 1.5 శాతానికి పెరిగిందని ఆయన అన్నారు. చంద్రబాబు తన హయాంలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.93,903 నుంచి రూ.1,54,031 పెరిగిందని గుర్తు చేశారు. తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం 13.21 శాతం పెరిగినప్పటికీ, గత ప్రభుత్వంలో అది 9.06 శాతానికి పడిపోయిందన్నారు.
ప్రభుత్వం జనవరిలో P4 విధానాన్ని ప్రారంభిస్తుందని, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారు అట్టడుగున ఉన్న వారిని పైకి తీసుకురావడంలో సహాయపడాలని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా సంపన్నులు, సంస్థలు సిఎస్ఆర్ ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి సహాయపడతారని చంద్రబాబు అన్నారు.