PaperDabba News Desk: July 22, 2024
ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పాటు వరద ప్రభావం పడిన గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
రక్షిత తాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి కాలుష్యం లేకుండా చూసుకోవాలని, క్లోరినేషన్ పై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని చెప్పారు.
పార్టీ సమావేశంలో చర్చలు
సోమవారం మధ్యాహ్నం శాసన సభలోని తన కార్యాలయంలో నిర్వహించిన జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో వర్షాలు, వరదల ప్రభావంపై ఎమ్మెల్యేలతో చర్చించారు. వరద ప్రభావం పడిన ప్రాంతాల శాసన సభ్యులు అక్కడి పరిస్థితులను వివరించారు. పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాలు పూర్తిగా నీట మునిగి ఉన్న పరిస్థితి గురించి ఆరా తీశారు. పెదవాగు ప్రాజెక్ట్ ప్రభావంతో అక్కడి గ్రామాలు వరద బారిన పడుతున్న విషయం చర్చకు వచ్చింది.
అధికారులకి ఆదేశాలు
వెలేరుపాడుతోపాటు కుక్కునూరు మండలంలోని గ్రామాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో వరద ప్రభావాన్ని ఎమ్మెల్యేలు వివరించారు. వరద ప్రభావం పడిన గ్రామాల్లో తాగునీటి సరఫరాతోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రహదారులకు ఈ వర్షాల వల్ల ఏ మేరకు నష్టం వాటిల్లిందో నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే మరమ్మతులు చేయవలసిన రహదారులను గుర్తించాలని సూచించారు.