4 వేల వేట పడవలకు శాటిలైట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశం..
మత్స్య సంపద అభివృద్ధి, ఎగుమతుల వృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి..
గత ప్రభుత్వంలో మత్స్యశాఖ నిర్లక్ష్యానికి గురైంది..
2014- 2019లో మత్స్యకారులకు అమలు చేసిన పథకాలు పునరుద్ధరణ..
2019-24లో మత్స్యశాఖలో అమలు చేసిన కార్యక్రమాలపై పున:పరిశీలన..
గత ప్రభుత్వ డీజిల్ సబ్సిడీ బకాయిలు రూ.10 కోట్లు చెల్లించాలి..
రాష్ట్రంలో మత్స్యశాఖ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని వ్యవసాయ, సహకార, గిడ్డంగులు, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి & మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడ, పెనమలూరులోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. నేడు జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారిగా మత్స్యశాఖపై రివ్యూ నిర్వహించానని తెలిపారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని వ్యాఖ్యానించారు. మత్స్యకారులకు డీజిల్ రాయితీ గత ప్రభుత్వంలో రూ.10 కోట్ల బకాయి ఉందని, డీజిల్ సబ్సిడీ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మత్స్యశాఖలో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. మత్స్యశాఖ అభివృద్ధి విషయంలో కేరళ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించాలని మంత్రి అధికారులకు సూచించారు.
మత్స్యకార భృతిపై కీలక ఆదేశాలు..
గత ప్రభుత్వంలో మత్స్యకారులకు వేట నిషేధిత సమయంలో ఇచ్చే భృతిని నిష్పక్షపాతంగా ఇవ్వలేదని, చాలాచోట్ల అనర్హులకు అందజేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే పరిహారం, లబ్ధిదారులపై రీసర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. మత్స్య పరిశ్రమ ఉత్పత్తుల సామర్థ్యం పెంచాలని, ఎగుమతుల వృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. 947 కిలోమీటర్ల సుదీర్ఘ సాగర తీరం ఉన్న మన రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తికి, ఎగుమతులకు ఉన్న అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
గత ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలపై పున:పరిశీలన..
గత ప్రభుత్వ హయాంలో ఐదు హార్బర్లకు టెండర్లు పిలిచి సొంతవారికే కట్టబెట్టారని, పనులు ప్రారంభించేందుకు అప్పటి ప్రభుత్వం 40 శాతం నిధులు కూడా చెల్లించిందన్నారు. రెండోసారి నాలుగు హార్బర్లను అప్పటి ఎమ్మెల్యేకు, ఆయన తమ్ముడికి ఇచ్చారని ఆరోపించారు. ఈ నాలుగింటిలో రెండు హార్బర్లు పనిచేయడం లేదని, ఈ నేపథ్యంలో.. 2019-24లో మత్స్యశాఖలో అమలు చేసిన కార్యక్రమాలపై పున:పరిశీలన చేసి నివేదికలు అందజేయాలని సూచించారు. బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల ప్రస్తుత స్థితిగతులపై నివేదిక సమర్పించాలన్నారు.
అలాగే, 2014- 2019 వరకు మత్స్యశాఖ అమలు చేసిన పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మత్స్యశాఖకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై నివేదికలు రూపొందించినట్లయితే జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో వాటికి ఆమోదం లభించేలా ప్రయత్నం చేస్తానన్నారు. వేట సమయంలో మత్స్యకారుల మధ్య తలెత్తుతున్న వివాదాల విషయంలో చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులకు షెల్టర్ల నిర్మాణంపై కూడా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మత్స్యకారులకు బ్యాంకుల నుంచి లభించే రుణాలు, వాటికి సంబంధించిన వివరాలపై నివేదికలు సమర్పించాలన్నారు. విజయవాడ, కలిదిండిలో ఉన్న ఆక్వా హబ్స్ మాదిరి జిల్లా కేంద్రాల్లో కూడా హబ్స్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారులను అప్రమత్తం చేయడంతో పాటు వారు క్షేమంగా ఒడ్డుకు చేరుకునేలా వేటకు వెళ్లే పడవలకు శాటిలైట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 20 వేల వేట పడవులు ఉన్నాయని, వాటిలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 4 వేల పడవలకు శాటిలైట్ సిస్టమ్‌ను పెడుతున్నామన్నారు. దశలవారీగా మిగిలిన పడవలకు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మత్స్యశాఖల సెక్రటరీ శ్రీ అహ్మద్ బాబు, మత్స్యశాఖ కమిషనర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి, మత్స్యశాఖ అదనపు సంచాలకులు డా.(శ్రీమతి) ఎస్. అంజలి, జాయింట్ డైరెక్టర్లు డా. వి. వెంకటేశ్వరరావు, జి. హీరా నాయక్, ఎస్.కె. లాల్ మహ్మద్, డిప్యూటీ డైరెక్టర్లు పి. మాధవీలత, పి.వి. సత్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ పి.వి.వి.ఎస్.ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.