పీలేరు అటవీ ప్రాంతంలో పోలీసులు ఒక స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే… అన్నమయ్య జిల్లా పీలేరు అటవీ ప్రాంత్రంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలను స్వాధీన పరుచుకున్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ కూంబింగ్ నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక టీం ఆదివారం తిరుపతి నుంచి కేవీపల్లి మండలం ఎలమంద నుంచి మంచాల మంద పైపుగా ఈ కూంబింగ్ చేసుకుంటూ వెళ్లారు. అందులో భాగంగా వీరు మారెళ్ల బీటు పరిధికి చేరుకున్నారు. అక్కడ పించా నది సమీపంలో కొంత మంది వ్యక్తులు ఎర్రచందనం మోసుకుంటూ వెళ్లడం పోలీసులు గమనించారు. పోలీసులను గమనించిన వారు దుంగలను పడేసి పారిపోయారు. వారిని వెంబడించిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగలిగారు. అతని పేరు బలరామన్ పెరియస్వామి. వయసు 44 సం . లు గా గుర్తించారు.అక్కడే పడి వున్న 14 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడిన బలరామన్ పెరియస్వామి ని , ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఈ కేసును ఎస్ ఐ రఫీ దర్యాప్తు చేస్తున్నారు.