పేపర్డబ్బా న్యూస్ డెస్క్ – జూలై 1, 2024. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగానికి కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. వ్యవస్థాగత మార్పులతో పాటు, బాధ్యతల పంపిణీ జరగాలని అధికారులకు సూచించారు.
విభాగ విస్తరణ
సచివాలయంలో సోమవారం సాయంత్రం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, మూసీ డెవెలప్మెంట్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కూడా అవుటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ఆదేశించారు.
పేరుమార్పు మరియు పునర్వ్యవస్థీకరణ
ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. డీఐజీ స్థాయి అధికారి ఈ విభాగానికి డైరెక్టర్గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరైక్టర్లుగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక టీమ్లు ఈ విభాగంలో నియమించాలని సూచించారు.
సతత సేవలు
కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా విపత్తుల నిర్వహణ విభాగం సిటీ ప్రజలకు నిరంతరం సేవలు అందించేలా పునర్వవస్థీకరణ జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో ప్రజలు ఎదుర్కునే సమస్యలన్నింటిలో హైడ్రా క్రియాశీలంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
కీలక బాధ్యతలు
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు 2000 కిలోమీటర్ల చెర్వులు, కుంటలను పరిరక్షించటం, సిటీలోని నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగమే చేపట్టాలని నిర్ణయించారు. హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగు నీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలను అందిస్తుంది.
వనరుల కేటాయింపు మరియు అమలు
ఈ విభాగం పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది, విధులు, నిధుల కేటాయింపు, బాధ్యతలపై ముసాయిదా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.
మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు వేగవంతం
మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేలా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని అధికారులను అప్రమత్తం చేశారు.
చారిత్రక కట్టడాల పునరుద్ధరణ
హైదరాబాద్ సిటీలోని చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ను ప్రదర్శించింది. వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న వివిధ మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. వీటిలో మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టులో అనుసంధానం చేసేందుకు వీలైన వాటిని గుర్తించి, అందులోనే జోడించాలని సీఎం సూచించారు.
విపత్తుల నిర్వహణ విభాగాన్ని హైడ్రాగా పునర్వ్యవస్థీకరించడం మరియు విస్తరించడం హైదరాబాద్ ప్రజలకు సేవలు అందించే దిశగా కీలకమైన అడుగు.