ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు.. టెక్నాలజీని వాడుకుని ఎంతటివారినైనా ఇట్టే మోసం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ న్యాయవాదిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో రూ.33,500 అకౌంట్ నుంచి కాజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసం ఉండే వెంకటరత్నం అనే న్యాయవాదికి SBI బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ…. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ చేయాలని సైబర్ నేరగాళ్ళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లాయర్ వెంకటరత్నం మొబైల్ నెంబర్ కు ఓటీపీ పంపారు సైబర్ కేటుగాళ్లు. ఇది గుడ్డిగా నమ్మిన లాయర్ తిరిగి ఓటీపీని అవతలి వ్యక్తికి పంపారు బాధితుడు వెంకటరత్నం. దీంతో వెంకటరత్నం బ్యాంక్ అకౌంట్ నుంచి 33,500 వేలు డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటరత్నం.. స్థానిక కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు కామారెడ్డి పట్టణ పోలీసులు. తక్కువ వడ్డీకే రుణాల పేరిట మరో మోసం కామారెడ్డి జిల్లాలో అమాయక, గ్రామీణ, నిరక్షరాస్యులైన ప్రజలకు తక్కువ వడ్డీకి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు లోన్లు ఇప్పిస్తామంటూ.. దంపతులు బురిడీ కొట్టించారు. బాధితుల కథనం ప్రకారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన శ్రీహరి, రాణి అనే దంపతులు GDFC నిధి లిమిటెడ్ (పేదల పాలిట పెన్నిధి) అనే సంస్థ నుంచి తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తామంటూ గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, బీబీపేట తదితర మండలాలకు చెందిన సుమారు 250 మంది అమాయక ప్రజల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ. 10 వేల నుంచి రూ.15 వేల వరకు జీఎస్టీ, టాక్సీ, వివిధ పన్నుల రూపంలో సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు గత కొద్ది రోజుల నుంచి శ్రీహరి -రాణి కి ఫోన్లు చేశారు. ఫోన్ లో పొంతన లేని సమాధానం చెబుతూ.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సమాధానం చెప్పారు. గత రెండు రోజుల నుంచి ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు శ్రీహరి స్వగ్రామమైన చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ… తమకు అతి తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తానంటూ దంపతులు నమ్మబలకడంతో వారి మాటలు నమ్మి ఒక్కొక్కరు రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు తమ వద్ద నుంచి వివిధ ట్యాక్సీ రూపంలో వసూలు చేసుకుని సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేసి తమను మోసం చేశారంటూ వాపోతున్నారు బాధితులు. పోలీసులను ఆశ్రయించి తమ డబ్బులు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీహరి, వాణిల కోసం వెతుకుతున్నారు. అయితే సైబర్ మోసానికి గురైన వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు.