ఆటంకాలను అధిగమించి బందర్ పోర్టు పనులు ప్రారంభించుకోగలిగామన్నారు ఏపీ సీఎం జగన్. బందరు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుందన్నారు. మరో రెండేళ్లలో ఇక్కడ పెద్ద ఓడలు కనిపిస్తాయన్నారు. వేల మందికి ఉపాధి లభించబోతుందన్నారు. బందరు పోర్టుతో కృష్ణా జిల్లా చరిత్ర మారిపోనుందన్నారు సీఎం జగన్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు అధిగమించి పోర్టు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు.
ఏపీ సీఎం జగన్ ఈరోజు మచిలీపట్నంలో పర్యటిస్తున్నారు. ఏళ్ల నాటి కల ఎట్టకేలకు సాకారం అయింది. బందర్ పోర్టు నిర్మాణ పనులను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. సోమవారం ఉదయమే తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్ ఆవిష్కరించారు.
బందరు పోర్టు శంకుస్థాపన సందర్భంగా మచిలీపట్నంలో కోలాహలం నెలకొంది. భారీగా వైసీపీ శ్రేణులు తరలి వచ్చారు. వాళ్లను చూసిన ముఖ్యమంత్రి అభివాదం చేశారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్ లోని భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ బందరు పోర్టు గురించి వివరించారు. అదే టైంలో ప్రతిపక్షాలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.