Heavy Rain in Tirumala: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 44, 45 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, ఏపీలో కొన్ని చోట్ల 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే నేడు తిరుమలకు వెళ్లిన భక్తులకు ఎండల నుంచి ఉపశమనం లభించింది. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగేలా తిరుమలలో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగండ్లతో కూడిన వర్షం పడింది. దాదాపు 36 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు భారీ వర్షం కురవడంతో దాదాపు 20 డిగ్రీలకు తగ్గుముఖం పట్టాయి. ఉదయం 10 ఉదయం నుంచి తన ప్రభావాన్ని చూపే సూర్య భగవానుని వేడి నుంచి భక్తులకు వర్షంతో ఉపశమనం కలిగింది. వడగండ్ల వర్షం..వేసవి కాలంలో కురిసే వర్షాలను అకాల వర్షాలు అంటారు. సమ్మర్ లో కురిసే వర్షం కావడంతో వడగండ్లతో కూడిన భారీ వర్షం తిరుమలలో శుక్రవారం కురిసింది. భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురి అయిన వేసవిలో ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. తిరుమలలో రోడ్లు అన్ని వర్షపు నీటితో నిండి పోయాయి. భారీగా కురిసిన వర్షానికి నాలుగు మాఢ వీదులు జలమయం కాగా, స్వామి వారి దర్శనానికి వెళ్ళిన భక్తులు, స్వామి వారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిచి ముద్దయ్యారు. స్వామి వారి దర్శనం తరువాత వెలుపలకు వచ్చిన భక్తులు తమ వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురైనా, వేసవి తాపం నుంచి ఉపశమనం కలగడంతో సేద తీరుతున్నారు. అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు చల్లదనాన్ని ఏంజాయ్ చేస్తున్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు సమయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. గురువారం రోజున 56,680 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 18,947 మంది తలనీలాలు సమర్పించగా, 3.54 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 06 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు పది గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అటుతరువాత తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో “బెల్లం పూర్ణం బోండాలు, పోలీల” శుక్రవారం ప్రత్యేకంగా నివేదిస్తారు. ఇక వీటితో పాటుగా అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.