తెలంగాణలో లీకైన పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో అరెస్టు అయి కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు బెయిల్ పై విడుదల అయ్యారు. ఏ2 – ప్రశాంత్, ఏ3 – మహేశ్, ఏ4 – గణేష్ నేడు (ఏప్రిల్ 12) ఉదయం విడుదల అయ్యారు. ఈ సందర్భంగా నిందితుల్లో ఒకరైన ప్రశాంత్ మీడియాతో మాట్లాడాడు. పది హిందీ ప్రశ్నాపత్రం బయటకు రాగానే తాను ఓ జర్నలిస్టుగా జర్నలిస్టుల గ్రూపులో షేర్ చేశానని ప్రశాంత్ తెలిపాడు. ఆ గ్రూపుల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం చేస్తానని చెప్పాడు. తనపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అన్నాడు. బండి సంజయ్ తో తాను ఒకేసారి 40 సెకన్లు మాత్రమే మాట్లాడానని చెప్పాడు.
పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు రావడానికి కారణమైన వారి గురించి విచారణలో భాగంగా తనకు తెలిసిన అన్ని వివరాలు చెప్పి పోలీసులకు సహకరించామని ప్రశాంత్ తెలిపాడు. ఒక జర్నలిస్టుగా తాను గతంలో విద్యార్థుల సమస్యలను బయటకు తెచ్చానని, వారి భవిష్యత్తు ఎలా పాడు చేస్తానని చెప్పాడు. తనకు బెయిల్ రావడానికి ఏ రాజకీయ పార్టీ సహకారం అందించలేదని చెప్పాడు. కోర్టు నుంచే నేరుగా బెయిల్ పొందినట్లు చెప్పాడు.