టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ముసలాయనగా అభివర్ణించారు. ఇప్పడు ఎక్కడబడితే అక్కడ ఫోటోలు దిగుతూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ అంటున్నారని విమర్శించారు. టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి ఫోటోలు దిగుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక, ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా సొమ్ము డీబీటీ విధానం ద్వారా వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశామని గుర్తు చేశారు. మరి చంద్రబాబు హాయాంలో ఆ డబ్బు అంతా ఏమైందో అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ జరిగిన మంచి ఎంత అనేది బేరీజు వేసుకొనే సత్తా నీకు ఉందా చంద్రబాబు అని నిలదీశారు. ఈ నిజాలు మనిషి మనిషికీ తెలుసని అన్నారు.
ఇలాంటి చంద్రబాబు ఇంటింటికీ స్టిక్కర్ వేయడానికి అర్హుడా అని ప్రశ్నించారు. ఇళ్ల ముందు సెల్ఫీ దిగే నైతికత గానీ, స్టిక్కర్ అతికించే అర్హత కానీ చంద్రబాబు ఉందా అని అక్కచెల్లెమ్మలు ప్రశ్నించాలని సీఎం జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కాలేజీ మైదానంలో బుధవారం (ఏప్రిల్ 12) బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.