ఖమ్మంజిల్లాలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి జరిగింది. బాణసంచా పేలుడు దాటికి పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మంజిలా కారేపల్లి మండలం చీమలపాడులో విషాదం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళంలో ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే రాములు నాయక్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి నేతలంతా వచ్చారు. అగ్ర నేతలు గ్రామానికి వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చారు.
బాణ సంచా కాల్చినప్పుడు ఆ నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. అంతే మంటలు భారీగా చెలరేగి అందులో ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. అదే టైంలో అ నివాసంలో ఉన్న సిలిండర్ పేలింది. ఈ ధాటికి సమీపంలో ఉన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో స్పాట్‌లోనే ఒకరు చనిపోగా… మరో ఆరురుగు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా మందికి కాళ్లు చేతులు విరిగిపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆప్రాంతమంతా ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అప్పటి వరకు నేతల రాకతోసందడిగా ఉన్న ప్రాంతం రక్తసిక్తమైపోయింది.