Warangal CP Ranganath on Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. ఆరోపణలు నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని బండి సంజయ్ కు సీపీ రంగనాథ్ సవాల్ విసిరారు. అయితే మరో ప్రెస్ మీట్ అవసరం ఉండదని, తాను అనుకున్నానని కానీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పోలీసుగా స్పందించి వివరాలు వెల్లడిస్తున్నాం అన్నారు. నాలుగేళ్లు నల్గొండ ఎస్పీగా చేశాను, ఖమ్మంలోనూ తాను పని చేశానని.. కానీ కొన్నేళ్ల కిందటి వరకు లేని ఆరోపణలు బండి సంజయ్ ఇప్పుడు కేసులో ఇరుక్కోవడంతో లేనిపోని నిందలు, ఆరోపణలు చేశారన్నారు. తనపై బండి సంజయ్ చేసిన సెటిల్మెంట్ ఆరోపణలు నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్నారు వరంగల్ సీపీ రంగనాథ్. ప్రమాణం చేయాలని పోలీసులను కోరటం విచిత్రంగా ఉందన్నారు. మాల్ ప్రాక్టీస్ అని ముందే చెప్పామని, కానీ టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీకైందని దుష్ప్రచారం చేశారన్నారు. సత్యంబాబు కేసు తాను చూడలేదన్నారు. ఆ కేసులో తాను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదని స్పష్టం చేశారు.
సెటిల్మెంట్ లు చేశానని తనపై బండి సంజయ్ చేసిన ఆరోపణలు చూసి నవ్వాలో, ఏడవాలో తనకు అర్థం కాలేదన్నారు. పలు కేసులలో తాను కఠిన చర్యలు తీసుకుంటే బాధ కలుగుతుందన్నారు. వాళ్లు పోలీసులపై ఆరోపణలు చేయడం సహజమే. కానీ తాను ఎవరిపక్షాన ఉంటానో ప్రజలకే తెలుసునన్నారు. తాను ఇప్పటివరకూ పనిచేసిన చోట ఎక్కడైనా సెటెల్మెంట్ లు, దందాలు, తనకు లాభం చేకూరేలా ఏమైనా చేసినట్లు నిరూపిస్తే తాను పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు.