Ambedkar Konaseema District: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం.. అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామ సచివాలయంపై మంగళవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ ప్యాకెట్ పోసి నిప్పు పెట్టాడు. అయితే పెట్రోల్ ప్యాకెట్ సచివాలయ అరుగుపై పడడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇది అకతాయిల పనా లేక ఉద్దేశ్యపూర్వకంగా మంట పెట్టారా అన్న దానిపై స్పష్టత లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోడసకుర్రు గ్రామ సచివాలయం నిర్మాణంలో ఉండడంతో ఓ పురాతన పెంకుటిల్లులో అద్దె ప్రాతిపదికన సచివాలయం నిర్వహిస్తున్నారు. ఎప్పటిలానే మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని సిబ్బంది సచివాలయానికి తాళం వేసి వెళ్ళిపోయారు. రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో సచివాలయ అరుగుపై ఒక్కసారిగా మంటలు రావడంతో గమనించిన స్థానికులు మంటలను ఆర్పి సమాచారాన్ని సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి భర్త నాగేశ్వరరావుకు అందించారు. వెంటనే పరిశీలించగా మంటలకు సచివాలయ నోటీసు బోర్డు, అక్కడ అతికించిన పలు ప్రకటనలు కాలిపోయాయి. అంతకు మించి ఎటువంటి నష్టం కలుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన అగంతకుడు ద్విచక్ర వాహనం పై వచ్చాడని, ఆపై గ్రామం వైపుగా వెళ్లినట్లు చూశామని స్థానికుల్లో కొందరు చెబుతున్నారు. ఈసంఘటనసై సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి శింగంపల్లి దుర్గాశ్రీనివాస్ అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.