తెలంగాణ నుండి రేసులో వున్న నేతలు ఎవరు…?
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల సంఖ్య పెరగడంతో ఆశావాహుల సంఖ్య పెరిగిందా…?
కాంగ్రెస్ హై కమాండ్ ఎవరికి అవకాశం కల్పిస్తుంది…?
ఇంతకు కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఏముంది…?
దానిపై తెలంగాణ కాంగ్రెస్‌లో వినిపిస్తున్న లెక్కలేంటి?
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ సభ్యుల సంఖ్యను 35 కు పెంచుతూ ఇటీవల రాయ్ పూర్ లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 50 శాతం బీసీ, ఎస్సి,ఎస్టీ వర్గాలతో పాటుగా 50 ఏళ్ల వయసు ఉన్న వారికి అవకాశం కల్పించాలి. ఈ సారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు లేకుండా సీడబ్ల్యూసీ సభ్యులను నియమించే అధికారం జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించారు. దీనితో కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అవకాశం దక్కుతుంది అనే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎంపికలో రాజకీయ సమీకరణాలు మారడంతో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ పదవి కోసం చాలా మంది నేతలు రేసులో వున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఆ క్రమంలో రేసులో వున్న నేతల్లో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. పార్టీలో సీనియర్ కావడంతో పాటు అధిష్ఠానానికి సన్నిహిత నేత కావడంతో ఉత్తమ్ కు అవకాశం కల్పిస్తారు అనే చర్చ జరుగుతోంది. ఇక సామాజిక వర్గ సమీకరణల ఆధారంగా బీసీ కోటాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య తమకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఎస్టీలకు అవకాశం ఇస్తే ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం సీడబ్ల్యూసీ పదవి తమకు దక్కుతుంది అనే ధీమాలో కాంగ్రెస్ నేతలు వున్నారు.
తెలంగాణ నుండి చివరి సారిగా కె.కేశవరావు సీడబ్ల్యూసీకి ప్రాతినిధ్యం వహించారు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుండి టి.సుబ్బిరామిరెడ్డి సీడబ్ల్యూసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీనితో ఈ సారి ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను నియమించాలని కాంగ్రెస్ అధిష్టానంపై నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వున్న నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుండి సీడబ్ల్యూసీలో ఎంత మందికి అవకాశం కల్పిస్తుంది? ..ఎవరికి అవకాశం ఇస్తుందో వేచి చూడాలి.