- తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ కీ రోల్ పోషిస్తున్నారా?
- వచ్చే ఎన్నికల్లో తన మార్క్ చూపించేందుకు రెడీ అయ్యారా?
- కేటీఆర్ వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తుండటం అందుకేనా? ..
- ఇప్పటి నుండే అభ్యర్థులను ప్రకటించటం వెనుక ఆంతర్యం ఏంటి?
తెలంగాణ రాజకీయాలపైనే కేటీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలపై గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ పెడుతుంటే … కేటీఆర్ మాత్రం పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ జిల్లాల పర్యటనలతో బిజీబిజీగా మారారు. జిల్లాల్లో బిఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న కేటిఆర్ వచ్చే ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల హుజారాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ ఇప్పటి నుండే ప్రజల్లో ఉండాలంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సూచించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో హుజారాబాద్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారని బిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హుజారాబాద్ బిఆర్ఎస్ టిక్కెట్ ను గెల్లు శ్రీనివాస్ యాదవ్ సైతం ఆశిస్తున్నారు.
మరోవైపు భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మరోసారి అసెంబ్లీలో అడుగుపెడతారని పేర్కొన్నారు. దీంతో భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డికి లైన్ క్లియర్ అయ్యిందనే ప్రచారం ఊపందుకుంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరించారు. తన వర్గానికి చెందిన వారికి ఎక్కువగా అసెంబ్లీ టిక్కెట్లను ఇప్పించుకున్నారు. రెండవ సారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రభుత్వంలో అన్ని తానై వ్యవహరిస్తున్నారు. తన అనుచరులకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకున్నారు. బిఆర్ఎస్ పేరుతో గులాబీబాస్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా .. కేటీఆర్ మాత్రం జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టకుండా రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పార్టీలో తన ముద్ర ఉండేలా ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ బిఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది.
సీఎం కేసీఆర్ తర్వాత పార్టీలో..ప్రభుత్వంలో ఎప్పటి నుంచో కెటీఆర్ నెంబర్ టూ గా ఉంటూ వస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే తన వర్గాన్ని రెడీ చేసుకునే పనిలో కేటీఆర్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే జిల్లాల పర్యటనలోనే కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై హింట్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల విషయంలో తాను కీలకం కాబోతున్నట్లుగా ముందుగానే పార్టీ శ్రేణులకు సంకేతం ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.