ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. అయితే ఈ విషయంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి మద్దతు పలికి రాష్ట్ర అభివృద్ధిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
మార్చ్ 3, 4 తేదీల్లో రెండ్రోజులపాటు విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్నించి ప్రముఖులు హాజరుకానున్న ఈ సదస్సుకు దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు ముకేష్ అంబానీ, అదానీ, కుమార మంగళం, దాల్మియా తదితరులు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే 12 వేలమంది డెలిగేట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.ఈ నేపథ్యంలో విశాఖ సదస్సువైపు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఈ సదస్సుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖలో జరుగుతున్న జీఐఎస్‌కు తన మద్దతును ప్రకటించారు.అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు రానున్న రెండ్రోజులు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయనని అయన స్పష్టం చేశారు. పెట్టుబడుల ఆకర్షణ అంశమై ప్రభుత్వానికి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందన్నారు. శక్తివంతమైన, అనుభవం కలిగిన ఏపీ యువత పెట్టుబడిదారుల్ని మెప్పిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి కూడా హృదయపూర్వకంగా విన్నవించారు. ఏపీలో ఆర్ధికాభివృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటివాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటివి లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కల్గించాలని సమ్మిట్ ఆలోచనల్ని తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప నగరాలకు సైతం విస్తృతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.