తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలూ ఎప్పుడో కసరత్తు మొదలుపెట్టాయి. ఆ విషయంలో అధికార బిఆర్ఎస్ రెండడుగులు ముందే ఉంది. ఇప్పటికే పలు సర్వేలను చేయించిన పార్టీ అధినేత కేసీఆర్.. తాజాగా మరో కొత్త సర్వేకు శ్రీకారం చుడుతున్నారు. గెలుపుగుర్రాలెవరో తేల్చుకునే ప్రక్రియ మొదలు పెట్టారు. సిట్టింగ్‌లందరికీ దాదాపు టికెట్లు ఇస్తామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చిన ఆయన. అయితే తాజాగా మరోసారి క్షేత్రస్థాయి పరిస్థితిని తెప్పించుకుంటుండటం అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు ఒక సారి తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేలు చేయించుకోవడం పరిపాటే అన్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ కసరత్తు ముమ్మరం చేస్తున్నారు ఆయన. ఆ క్రమంలో తాజా సర్వేకు శ్రీకారం చుట్టబోతున్నారంట.
స్థానిక ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం?
ఈ సారి విజయావకాశాలు ఏ మేరకు ఉంటాయి?
ప్రత్యామ్నాయంగా ఎవరు బెటర్ ?
ఎంతమంది ఆశావహులు ఉన్నారు ?
గెలిచే పార్టీ ఏది? ఆ పార్టీలో ధీటైన అభ్యర్థి ఎవరు?
తదితరాలన్నింటిపై వివరాలను తెప్పించుకునే పనిలో ఉన్నారు ఆయన. అవసరమైతే అలాంటి అభ్యర్థుల్ని పార్టీలోకి చేర్చుకునే వ్యూహాలకి పదును పెడుతున్నారంటున్నారు.
గెలుపు గుర్రాలకు వల విసరడంపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవేళ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నట్లయితే వారిని ఇటువైపు ఆకర్షించడమా? లేక అందులోనే ఉండేటట్లయితే … గెలిచేందుకు పరోక్షంగా తగిన సహాయ సహకారాలు ఇచ్చి…ఆ తర్వాత చేర్చుకోవడమా?.. వంటి ఆలోచనలతో మంతనాలు సాగిస్తున్నారంట గులాబీబాస్
దాదాపు పాతికమంది సిట్టింగ్‌లు ఈసారి ఓడిపోతారంటూ ఇటీవల మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. సరికొత్త వ్యూహంపై పార్టీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది.. ఏయే స్థానాల్లో పరిస్థితి ఎలా ఉన్నదనే వివరాలపై ఆరా తీస్తోంది సిట్టింగ్‌లపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లయితే వారికి బదులుగా కొత్తగా ఎవరికి టికెట్ ఇవ్వాలి.. ఆ స్థానంలో టికెట్ ఆశిస్తున్నదెవరు.. ఎక్కువ మందిలో ఎవరికి ఇస్తే బెటర్ ఛాయిస్ అవుతుంది.. వీటిపైనే ఇప్పుడు అధినేత కేసీఆర్ దృష్టి సారించారంట.
ఇప్పటివరకు వచ్చిన సర్వే రిపోర్టుల ఆధారంగా పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో స్పష్టత ఏర్పడింది… తాజాగా మరో సర్వేకు గ్రౌండ్ ప్రిపేర్ అయింది. ఏయే అంశాలపై సర్వే ద్వారా తెలుసుకోవాలనే ఎజెండా కూడా ఖరారైంది. మొత్తం 21 ప్రశ్నలతో కొత్త సర్వే ప్రారంభం కానుందని అంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఆ అధ్యయనంలో రిపోర్టు వచ్చిన తర్వాత తగిన వ్యూహం రెడీ చేస్తారంట.
ఈ సారి హ్యాట్రిక్ గెలుపు సాధించాలని బిఆర్ఎస్ పట్టుదలగా ఉంది. అలాగే 2018 ఎన్నికల్లో వచ్చిన సీట్లకంటే ఏ మాత్రం తగ్గకూడదని పార్టీ స్పష్టమైన అభిప్రాయంతో ఉందంటున్నారు … గత ఎన్నికల్లో … ‘సారు.. కారు.. నూరు.. సర్కారు..’ … అనే నినాదాన్ని రూపొందించుకున్నా 88 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలతో సెంచరీ మార్కును దాటేసింది. ఈసారి కూడా అంతకంటే సీట్లు తగ్గరాదనే తీరులో యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తున్నారంటున్నారు
ఒకవేళ సీట్లు తగ్గితే ప్రభుత్వం పట్ల, పార్టీపైనా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదనే విమర్శలకు బలం చేకూరినట్లవుతుందని భావిస్తున్నారంట.. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏ సెగ్మెంట్‌లో ఓటమి తప్పదని సర్వే నివేదికలో వెల్లడైతే … అక్కడ ఎవరికి గెలిచే ఛాన్స్ ఎవరికి ఉందో తెలుసుకుని వారికి వల వేసే ప్లాన్‌ను అమలుచేయాలనుకుంటోంది బిఆర్ఎస్.. ఒకవేళ అది వర్కౌట్ కానిపక్షంలో ఇతర మార్గాలేమున్నాయో కూడా క్షేత్రస్థాయి నుంచే వివరాలను రాబట్టనున్నది.
ఆ క్రమంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలుపును నిలువరించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయడంతో పాటు చివరి అస్త్రంగా పార్టీలోకి చేర్చుకోడానికి పావులు కదపాలనుకుంటోందంటున్నారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలును స్పీడప్ చేయడం, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను పార్టీ బలహీనంగా ఉన్న సెగ్మెంట్లలో ఖర్చు చేయడం, ప్రత్యర్థి పార్టీలకు స్థానం లేకుండా చేయడానికి మైండ్‌గేమ్ మొదలుపెట్టడం, నైతికంగా డీమోరల్ అయ్యేలా వ్యూహాన్ని అమలుచేయడం.. ఇలా పెద్ద స్కెచ్చే గీస్తోందంట గులాబీ పార్టీ.
గత ఎన్నికల్లో రెండు కూటముల మధ్యనే పోటీ ఉండగా …ఈసారి అనూహ్యంగా బీజేపీ బలపడడంతో ముక్కోణపు పోటీ అనివార్యమైంది. ఇంతకాలం రాష్ట్రానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోకీ విస్తరించి జాతీయ పార్టీగా అవతరించాలని భావిస్తోంది. దాంతో తెలంగాణలో భారీ మెజారిటీ ఆ పార్టీకి ఇప్పుడు తప్పనిసరి కానుంది… ఏదేమైనా బిఆర్ఎస్ సైలెంట్‌గా గీస్తున్న స్కెచ్‌లు ప్రత్యర్ధులను మరింత అలెర్ట్ చేస్తున్నాయిప్పుడు..