Contents
ఉద్యోగాల తొలగింపులు..
ఆర్థిక మాంద్యం, అస్థిరతల మధ్య అనేక కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవటంలో భాగంగా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇలా మీకు కూడా జాబ్ పోయినా లేక మీదే ఉన్న ఉద్యోగాన్ని మానేసినా ఇన్సూరెన్స్ కవర్ నిలిచిపోతుందని తెలుసు. అయితే ఇలాంటి సందర్భంలో కంపెనీ అందించిన గ్రూప్ ఇన్సూరెన్స్ కవర్ ను వినియోగించుకోవటానికి ఒక మార్గం ఉందని మనలో చాలా మందికి తెలియదు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్సూరెన్స్ కవర్ పోకుండా..
ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ నుంచి బయటికి వెళ్లినప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ పోతుందని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వారు పనిచేసిన కంపెనీ ఇచ్చిన హెల్త్ పాలసీని ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ పాలసీగా మార్చుకోవచ్చు.
IRDAI ఏమందంటే..
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీనికి సంబంధించి వెసులుబాటు కల్పించింది. ఎవరైనా ఉద్యోగి తన కంపెనీ అందించిన గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ కవర్ పాలసీగా మార్చుకోవచ్చని IRDAI స్పష్టం చేసింది.
పాలసీ పోర్టింగ్ ఇలా..
గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద కవర్ చేయబడిన కుటుంబ సభ్యులతో సహా వ్యక్తులు.. అదే ఇన్సూరెన్స్ కంపెనీలో ఇండివిడ్యువల్ లేదా కుటుంబ ఆరోగ్య బీమా పాలసీకి మారవచ్చు. అటువంటి సందర్భాల్లో.. పనిచేస్తున్న కంపెనీలో చివరి వర్కింగ్ డే కి కనీసం 45 రోజుల ముందరే పాలసీ పోర్ట్ కోసం సదరు ఉద్యోగి ఇన్సూరెన్స్ కంపెనీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దీనిపై మీ నిర్ణయాన్ని తెలపటానికి చివరి పనిదినం తర్వాత 5 రోజులు అదనపు సమయం పొందుతారు. గ్రూప్ పాలసీ కింద ఎంచుకున్న బీమా కవర్ మొత్తానికి మాత్రమే పోర్టబిలిటీ ఎంపిక వర్తిస్తుందని గుర్తుంచుకోండి.
ప్రయోజనాల బదిలీ..
చివరిగా అందరూ తెలుసుకోవాలనుకునేది ప్రయోజనాల గురించే. గ్రూప్ పాలసీ కింద ఇప్పటికే వివిధ వెయిటింగ్ పీరియడ్‌లలో గడిపిన సమయం కూడా బదిలీ చేయబడుతుంది.
గ్రూప్ పాలసీలోని వ్యక్తిగత సభ్యులకు నిరంతర సంవత్సరాల కవరేజీ ఆధారంగా వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్‌లు కేటాయించబడతాయి. అయితే పోర్టింగ్, అధిక కవర్ ఇవ్వడంపై తుది నిర్ణయం ఇన్సూరెన్స్ కంపెనీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలు పొందేందుకు మీ బీమా కంపెనీ కస్టమర్ కేర్ కు కాల్ చేయటం ఉత్తమం.