- అభివృద్ధిలో ఏపీ అగ్రగామి
- కేంద్రం జీడీపీ కన్నా 2.73 శాతం ఏపీ జీడీపీ ఎక్కువ
- టీడీపీది ఆర్భాట పాలన
వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళు ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ… మరో పక్క రాష్ర్టాన్ని అభివృద్ది బాటలో నిలిపేలా పటిష్ఠ ప్రణాళికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.ఈ సందర్భంగా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో మన రాష్ర్టం పారిశ్రామికంగా, ఆర్ధికంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు దూసుకువెళ్తుందని అన్నారు.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఏపీ :
2021-22లో మన రాష్ట్రం 11.43శాతం జి.ఎస్.డి.పితో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా ఏపీ వుందని దేశ జి.డి.పి 8.7 నమోదు అవ్వగా… మన రాష్ర్ట జి.ఎస్.డి.పి కేంద్రం జీడీపీ కన్నా 2.73 శాతం ఎక్కువని తెలిపారు.కొవిడ్ 19 సమయంలో భారత దేశ వృద్ది రేటు -6.60 శాతం నమోదైన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రం 0.08 శాతం వృద్ధిని నమోదు చేసిందని రాష్ర్ట తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కన్నా 38.5 శాతం ఎక్కువనిదేశంలోనే మన రాష్ట్రం తలసరి ఆదాయంలో 6వ స్ధానంలో వుందని ఆయన తెలిపారు.గత చంద్రబాబు పాలనలో 2018-19లో 5.36 శాతం వృద్దిరేటు వుంటే.. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో 2021-22 నాటికి 11.43 శాతం వృద్దిరేటు నమోదు చేసిందని ఆయన తెలిపారు.ప్రస్తుతం నమోదవుతున్న వృద్దిరేటు దేనికి సూచిక.. అభివృద్దికి కాదా.. రాష్ర్టం పురోగతిలో వుందో..తిరోగతిలో వుందో..ఈ వృద్దిరేటు ఆధారంగా తెలియడం లేదా…అని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. దురదృష్టకరమైన విషయమేమిటంటే కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలకు ఈ నిజాలు కనపడవు, వినపడవు అని ఇది మన దురదృష్టమని పేర్కొన్నారు.
డిపిఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ) నివేదిక ప్రకారం, 2022 జూలై చివరి నాటికి భారతదేశ వ్యాప్తంగా 1,71,285 కోట్ల పెట్టుబడులు రాగా అందులో మన రాష్ర్టం ఇతర రాష్ట్రాలతో పోటీపడి రూ.40,361 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామన్నారు.పారిశ్రామిక వృద్ధికై ఎస్.ఐ.పీ.బి (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) 2022 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ₹23,985 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందని వీటిలో ₹8,800 కోట్లతో జె.ఎస్.డబ్ల్యూ స్టీల్స్ కడపలో స్టీల్ ప్లాంట్‌ను ₹6,330 కోట్లుతో అదానీ గ్రీన్ ఎనర్జీ, ₹8,855 కోట్లతో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఎస్.ఐ.పీ.బి ఆమోదం తెలిపిందని అన్నారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, పెట్టుబడిలను రాబట్టడంలో AP 5వ స్థానంలో ఉందని పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చెయ్యడంలో 3వ స్థానంలోను దక్షిణ భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, AP ఈ రెండింటిలోను.. మొదటి స్థానంలో ఉందని అలాగే జూన్ 2022లో టైర్ల తయారీ రంగంలో ప్రపంచంలోననే మొదటి ఐదు కంపెనీలలో ఒకటైనా ఏటీసీ అలయన్స్ టైర్స్ 1,240 కోట్లతో విశాఖపట్నంలో ప్లాంట్ కోసం పెట్టుబడి పెట్టిందని ‘సైబరాబాద్’ ను క్రెడిట్ కోసం నేనే నిర్మించా అని చెప్పుకుని ఎల్లవేళలా పబ్బం గడుపుకునే చంద్రబాబుకు… 40 ఏళ్ళ అనుభవానికి సాధ్యం కాని అభివృద్దిని యువనాయకుడైన జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళలో చేసి చూపారని పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తుందని రెండింటికి తేడా గమనించాలని చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున ఇండస్ట్రియల్ పాలసీతో సీఎం జగన్ ఏపీలో పెట్టుబడులు ఆకర్షించేలా పారిశ్రామిక రంగానికి కల్పిస్తున్న అవకాశాలు, వసతులతో ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వరుసగా 4సంవత్సరాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.పెట్టుబడులకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడంలో భారతదేశంలోని అగ్రశ్రేణి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌కు స్థానం లభించడం మనకు గర్వకారణం. జూన్ 2022లో బీఆర్ ఏపీ (వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక) తెలిపిన రేటింగ్స్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గుజరాత్, తెలంగాణ, తమిళనాడులను ఏపీ అధిగమించి అగ్రస్థానాన్ని పొందిందని ఇది మేము చెప్తుంది కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వెల్లడించిన నివేదికలని అన్నారు.బీడీపీ బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్‌ల కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో సహా అన్ని దక్షిణ భారత రాష్ట్రాలలో ఏపీ అగ్రగామిగా నిలిచిందని దీని వల్లే ఆగస్టు 2022లో తూర్పు గోదావరిలో బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్‌ను స్థాపించడానికి కేంద్రం నుండి ₹1,000 కోట్ల గ్రాంట్‌ను పొందిందని పేర్కొన్నారు.
ఎం.ఎస్.ఎం.ఈ లకు తోడ్పాటు :
అన్ని ప్రభుత్వ కొనుగోళ్లలో ఎం.ఎస్.ఎం.ఈ లకు మార్కెట్ లో విస్తృత ప్రాధాన్యతను కల్పించిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. కోవిడ్-19 సమయంలో ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి ఎం.ఎస్.ఎం.ఈలకు రీస్టార్ట్ ప్యాకేజీని సీఎం జగన్ ప్రభుత్వం పొడిగించిందని వైఎస్సార్ నవోదయం స్కీమ్ కింద ఎం.ఎస్.ఎం.ఈ లకు ₹7,976 కోట్ల పైచిలుకు రుణాలను పునర్నిర్మించిన 1.78 లక్షల ఎం.ఎస్.ఎం.ఈ ఖాతాలకు అందించబడిందని తెలిపారు. అంతేకాకుండా
వైఎస్సార్ కడపలోని కొప్పర్తిలో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈ.ఎం.సీ)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,155 ఎకరాల విస్తీర్ణంలో హబ్‌ను అభివృద్ధి చేసి డిసెంబర్ 23,2021న ప్రారంభించిందని వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బల్క్ వాటర్ సప్లై, విద్యుత్ ఇలా అనేక రకాల అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయబడుతోందని నవరత్నాల రూపంలో పేదలకు అందించిన సంక్షేమం రూ. 1.92 లక్షల కోట్లపైనే ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు, మిల్క్ చిల్లింగ్ కేంద్రాలు వంటివి అనేకం ఏర్పాటు చేయడం అభివృద్ది కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు.
అసత్య ప్రచారాలకు అడ్డాగా తెలుగుదేశం :
గత చంద్రబాబు హయాంలో 2014-19 వరుకు 5సార్లు దావోస్ వెళ్ళి ప్రపంచ ఆర్దిక వేదికల్లో పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఆ పర్యటనల వల్ల దాదాపు 80 కోట్లు ఖర్చు చేసారని కానీ ఆ ఒప్పందాల్లో కనీసం ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు.గత ఏడాది మే నెలలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్త్వంలో దావోస్ వెళ్ళిన బృందం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో సహా దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఎం.వోయులు చేసుకోవడంతో పాటు.. దాదాపు 30వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడులకు ఎస్.ఐ.పీ.బి అనుమతులు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రచార ఆర్బాటం తప్ప చేసుకున్న ఎం.వో.యుల కోసం ఏ పోరాటం చేయకుండానే వంటలు, స్నానాలు, జ్వరాలు అంటూ గ్లోబల్ ప్రచారం చేసుకున్న సంగతి మనమందరం చూశాం ఇవన్నీ ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారని గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులను వైసీపీ ప్రభుత్వమే సాధించిందని అన్నారు.
గ్లోబల్ ఇన్విస్టేమెంట్ సమ్మిట్ తో మరిన్ని పెట్టుబడులు :
వచ్చేనెల మార్చిలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్విస్టేమెంట్ సమ్మిట్ లో రాష్ర్టానికి అన్ని రంగాల్లో ఎన్నో పెట్టుబడులు రానున్నాయని ఆయన తెలిపారు. గతంలో అనువైన ప్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేయలేదు అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సీఎం జగన్ లక్ష్యం రాజధాని ఉంటేనే పరిశ్రమంలో వస్తాయని చెప్తున్న చంద్రబాబుకు అమరావతిలో ఎందుకు పరిశ్రమలు తీసుకురాలేకపోయారని సూటిగా ప్రశ్నించారు రాజధాని కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ సూచనలను పక్కనపెట్టి తన సొంత కమిటీ సూచనలను చంద్రబాబు ఆచరించారని పేర్కొన్నారు.
ఈ తరం యువతకు అవకాశాలు సృష్టించి రాబోయే తరం వారికి మార్గం సుగుమం చేస్తున్నామని తెలిపారు. రైతులు మోసపోకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం ఏపీ అని అన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పథంలో ముందుకు తిసుకెళ్తుంటే రాష్ట్రం శ్రీలంక, జింబ్యాబ్వేల మారిపోయిందని నిత్యం వార్తాపత్రికల్లో అసత్య కధనాలు అల్లుతున్నారని మంత్రి చెల్లిబోయిన పేర్కొన్నారు.