- ఆర్టీసీ బస్టాండ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలని ఈనెల 14న ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్ వద్ద సిపిఎం ఆందోళన .
- రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్టాండ్లను దశలవారీగా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు లీజు ప్రాతిపదికన కట్టబెట్టాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14వ తేదీన కడప నగరంలో ఉన్న ఆర్టీసీ ఆర్ ఎం ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎం కడప నగర కార్యదర్శి ఏ రామమోహన్ తెలియజేశారు.
- ఆదివారం నాడు కడప నగరంలోని పాత బస్టాండ్ లో ఉన్న సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు చంద్రారెడ్డి నగర కమిటీ సభ్యుడు ఎం ఆర్ నాయక్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో మదనపల్లి బస్టాండ్ ను ఎంపీక చేసి ప్రతిపాదన సిద్ధం చేశారని దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
- ఆర్టీసీ బస్టాండ్లను 33 సంవత్సరాలు పాటు లీజ్ కు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
- ఆర్టీసీ బస్టాండ్ ల వినియోగానికి లీజ్ కు ఇచ్చేందుకు ఈనెల 14వ తేదీన ఆర్టీసీ కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని చేసిన ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
- ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ కాలం లీజుకు కట్టబెట్టడం ద్వారా రానున్న కాలంలో అవి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోనే కొనసాగే అవకాశాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
- రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చడానికి ఇతర మార్గాలు వున్నాయని, లీజు పేరుతో ఆర్టీసీ బస్టాండ్లను విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తుల, సంస్థల కోసం కట్టబెట్టాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన చర్యని వారన్నారు.
- తక్షణమే ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14వ తేదీన ఉదయం 10:30 గంటలకు కడపలో ఉన్న ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
- ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.