- 128 గంటల తర్వాత శిథిలాల నుంచి బయటపడ్డ 2 నెలల చిన్నారి.
భూకంపంతో దెబ్బతిన్న టర్కీలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచదేశాలు టర్కీ, సిరియా దేశాలకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన రెండు భూకంపాలు టర్కీని తీవ్రంగా దెబ్బతీసింది. 6000కు పైగా భవనాలు కుప్పకూలాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 25 వేలకు చేరుకుంది. మరింతగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇంతటి విపత్తులో కూడా కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. శిథిలాల కింద నుంచి కొంతమంది మృత్యుంజయులుగా బయటపడుతున్నారు. ఇటీవల సిరియాలో శిథిలాల కిందే ఓ శిశువు జన్మించాడు. 17 ఏళ్ల యువకుడు 100 గంటలకు పైగా శిథిలాల కింద ఉండీ, తన మూత్రం తానే తాగి ప్రాణాలను దక్కించుకున్నాడు. తాజాగా టర్కీలోని హటాయ్ ప్రాంతంలో శిథిలాల కింద 128 గంటల పాటు ఉన్న 2 నెలల శిశువును రక్షించారు. తల్లిపాలు లేకుండా ఈ చిన్నారి 128 గంటల పాటు సజీవంగా ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది దేవుడి అద్భుతం అంటున్నారు ప్రజలు.
భూకంపం వచ్చి ఐదురోజులు అవుతోంది. వివిధ దేశాలకు చెందిన సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయి. భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో సహాయకార్యక్రమాలు చేపడుతోంది. రెస్య్కూ సిబ్బందితో పాటు వైద్యులను, మెడిసిన్స్ ను టర్కీకి పంపింది. మొదటి మూడు రోజులు కీలకం కాగా, ప్రస్తుతం ఆ గోల్డెన్ టైమ్ అయిపోయింది. దీంతో రానున్న కాలంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.