- జి20 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు యూపీఐ సేవలు…
- ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ…
జి20 దేశాల నుంచి మన దేశానికి వచ్చే వారు, ఇక్కడ యూపీఐ సేవలను వినియోగించుకునేందుకు అనుమతులనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఒక సర్క్యులర్ జారీ చేసింది. మన దేశంలో వారు షాపింగ్, ఇతరత్రా అవసరాలకు చేసే చెల్లింపులను, అత్యంత సులువుగా నిర్వహించుకునేందుకు ఈ వెసులుబాటు తీసుకొచ్చింది. తొలుత ఎంపిక చేసిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో జి20 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు తమ మర్చంట్ చెల్లింపుల (పీ2ఎమ్)ను చేయొచ్చు. అనంతరం దేశంలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లోనూ ఈ వెసులుబాటును కల్పించనున్నారు.
Contents
ఇలా చేయొచ్చు:
యూపీఐకి అనుసంధానంగా పనిచేసే వాలెట్ల రూపంలో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్లను సంబంధిత బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు ఆయా ప్రయాణికులకు అందిస్తాయి. వీటి ద్వారా కేవలం మర్చంట్ చెల్లింపులను చేసుకోవచ్చు. ఒక వేళ అందులో నగదు మిగిలితే.. ఆయా దేశస్థుల కరెన్సీ రూపంలోనే వారి వారి ఖాతాలకు (బ్యాక్ టు సోర్స్) జమ అవుతుంది.
జి20 దేశాలివే:
అర్జైంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, ద రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్.