- మంచి అలవాట్లతోనే మంచి ఆరోగ్యం
- అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు
- ఉద్యోగుల అవగాహన కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి
జీవన విధానంలో ఎదురయ్యే ఆరోగ్య ఇబ్బందులను గుర్తించి వాటిపట్ల అవగాహన కల్పించుకుంటేనే జబ్బుల నుండి రక్షణ కల్పించుకోవచ్చని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు.శ్వేత ఆధ్వర్యంలో టీటీడీ పురుష ఉద్యోగులకు మూడు రోజుల పాటు నిర్వహించే జీవనశైలి రుగ్మతలపై అవగాహన కార్యక్రమం శనివారం మహతి ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈవో ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. స్థూలకాయం వల్ల షుగర్, గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. రోజుకు 8 గంటల నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, యోగా, ధ్యానం లాంటి అలవాట్లతో ఇలాంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చునన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థకు కూడా మంచి సేవలు అందించగలుగుతారని ఈవో చెప్పారు.ఉద్యోగులకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. జబ్బుల లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. శ్వేత ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జేఈవో , శ్వేత డైరెక్టర్ ను అభినందించారు.జేఈవో సదా భార్గవి మాట్లాడుతూ, నేటి సమాజంలో ప్రజలు అనేక వ్యాధులతో బాధ పడుతున్నారని అన్నారు. వీటిపట్ల అవగాహన కల్పించడం కోసమే ఉద్యోగులకు మూడురోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. వివిధ వ్యాధులకు వైద్యం అందించే ప్రముఖ నిపుణులతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల ఉద్యోగులకు ఎంతో ఉపయోగం లభిస్తుందని ఆమె అభిప్రాయ పడ్డారు. ఉద్యోగులు వ్యాధుల పట్ల అవగాహన కల్పించుకుని జీవన విధానంలో మార్పులు చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఆమె పిలుపు నిచ్చారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ, 15 సంవత్సరాల వయసు దాటినప్పటి నుండే వ్యాధుల పట్ల అవగాహన కల్పించుకోవాల్సి ఉందన్నారు. మంచి నిద్ర, ఆహారం,వ్యాయామం వల్ల అనేక వ్యాధులను దూరంగా ఉంచుకోవచ్చన్నారు. గురక వల్ల గుండె, మెదడుకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయన్నారు. వీటిపై అవగాహన కల్పించుకుని ఆచరిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చునని ఆమె తెలిపారు. పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమం ద్వారా ఉద్యోగులు అనేక విషయాలపై అవగాహన చేసుకోవచ్చని అన్నారు.ముందుజాగ్రత్త, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా రక్షించుకోవచ్చని ఆయన చెప్పారు.
శ్వేత డైరెక్టర్ ప్రశాంతి శ్వేత కార్యక్రమాల గురించి వివరించారు.ఈ సందర్బంగా జీవన శైలి రుగ్మతలపై ముద్రించిన పాకెట్ పుస్తకాన్ని వీరు ఆవిష్కరించారు. అత్యధిక షుగర్ లెవల్స్ తో బాధపడుతున్న ఉద్యోగులకు కిట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అధికారులు ,ఉద్యోగులు పాల్గొన్నారు.