పశ్చిమ రాయలసీమ ప్రాంత నియోజకవర్గం పట్టభద్రులు,ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలపై ప్రస్తుత మండలి పోరు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ లకు ప్రతిష్టాత్మకంగా మారింది.అయితే డిమాండ్లు నెరవేర్చలేదని టీచర్లలో ఉన్న వ్యతిరేకత, ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల జాప్యంతో ఆయా వర్గాల్లో పెరుగుతున్న వ్యతిరేకత అధికారపక్షంలో టెన్షన్ పుట్టిస్తోందంట
రాయలసీమ ప్రాంతంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.అంటే గ్రాడ్యుయేట్లు, టీచర్లే సదరు ఎమ్మెల్సీలని ఎన్నుకోవాల్సి ఉంది.ఎన్నిక జరిగే నియోజకవర్గం పరిధిలోనే కడప జిల్లా ఉంది.. అది ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో వైసీపీ మద్దతుదారుడిని గెలిపించుకోవాలని ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. మరోవైపు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను, ప్రధానంగా ఉద్యోగ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని కూడగట్టుకుని విజయబావుటా ఎగరవేయాలని టీడీపీ చూస్తోంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో పట్టభద్రుల పోరు రసవత్తరంగా మారింది.పట్టభద్రుల మండలి నుంచి వైసీపీ మద్దతు దారుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ మద్దతు దారుడుగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తలపడుతున్నారు.వెన్నపూస రవీంద్రారెడ్డి తండ్రి గోపాల్ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కొన్ని నెలల క్రితమే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రవీంద్రారెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది. మూడు నెలలుగా ఆయన ప్రచారపర్వంలో దిగిపోయారు. ఇక, తెలుగుదేశం పార్టీ మద్దతారుడుగా బరిలో ఉన్న రాంగోపాల్ రెడ్డి సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో క్రియాశీలక నాయకుడుగా ఉన్నారు. ఈయనను సుమారు అయిదు నెలల క్రితమే ఆ పార్టీ అధినేత చంద్రబాబు తమ అభ్యర్థిగా ప్రకటించారు.
పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు వైసీపీ, టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. గత కొంతకాలంగా ఓటర్ల నమోదు తో పాటు ఆయా పార్టీల నాయకులను, ముఖ్యులను కలుస్తూ మద్దతు కోరుతూ వస్తున్నాయి,అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం, సకాలంలో జీతాలు చెల్లించలేకపోవడం,ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం.. ఇవన్నీ ఈ ఎన్నికల్లో వైసిపికి మైనస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.ఆ వ్యతిరేకతను అధిగమించి ఓటు చేజారకుండా చూసుకోవడానికి సీపీ గట్టిగా ప్రయత్నిస్తుండగా, అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డా, ప్రలోభాలకు ఓటర్లను గురి చేసినా అడ్డుకునేందుకు టీడీపీ సిద్ధమైంది.ఈ నేపథ్యంలో కడపతో పాటు పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం ,పుట్టపర్తి, అన్నమయ్య జిల్లాలో రాజకీయ కాక రేపుతోంది.
ఉపాధ్యాయుల స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని టీడీపీ ఇంకా ప్రకటించలేదు. వైసీపీ మాత్రం ఎం.వి.రామచంద్ర రెడ్డి కి మద్దతు ఇస్తుంది. అపస్మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల బరిలో దిగిన ఆయన్ను గెలిపించడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ఆర్జేడీ వెంకటకృష్ణా రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో ప్రతాపరెడ్డిని తీసుకోవడం ఎన్నికల వ్యూహంలో భాగం అన్న ఆరోపణలు వినిపించాయి.ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఓట్ల నమోదు చేయించడంలోనూ వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. రామచంద్ర రెడ్డి తో పాటు మరో నలుగురు ఉపాధ్యాయ మండలి పోటీలో ఉన్నారు.ఏదేమైనా ప్రత్యక్ష ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా ప్రచారం జరుగుతున్న ఈ ఎన్నికల్లో విక్టరీ ఎవరిని వరిస్తుందో చూడాలి