రాష్ట్రంలో డివిజనల్ అకౌంట్స్ అధికారి (డీఏవో) పోస్టుల రాతపరీక్ష తేదీపై అభ్యర్థుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షను వాయిదా వేయకుండా షెడ్యూలు ప్రకారం నిర్వహించాలని కొందరు పట్టుబడుతుంటే.. మరికొందరు ఇతర పరీక్షలు ఉన్నందున వాయిదా వేయాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ కార్యాలయంలో 53 డివిజనల్ అకౌంట్స్ అధికారి పోస్టులను భర్తీ చేసేంందుకు గత ఏడాది ఆగస్టులో టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. తరువాత స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీరు, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పీఆర్‌టీ పరీక్ష, ఎయిర్‌పోర్టు అథారిటీ పరీక్ష, యూజీసీ నెట్ పరీక్షలను అదేరోజున నిర్వహించేలా తేదీలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర పోస్టులకు సిద్ధమవుతూ డీఏవో పరీక్షకు హాజరుకావాలనుకున్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కొందరు డీఏవో పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రొఫెషనల్ డిగ్రీలు లేకుండా బీఎస్సీ, బీకాం, బీఏ అర్హతతో ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు షెడ్యూలు ప్రకారం నిర్వహించాలని కోరుతున్నారు. ప్రొఫెషనల్ డిగ్రీలు ఉన్నవారికి ఇతర పోస్టులు ఉన్నాయని, సాధారణ డిగ్రీ కలిగిన వారికి వచ్చిన అవకాశాన్ని దూరం చేయవద్దని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ పరీక్ష తేదీని వాయిదా వేస్తే మరో ఆరునెలల వరకు డీఏవో పరీక్షను నిర్వహించే అవకాశం లేదని తెలిసింది. దీంతో షెడ్యూలు ప్రకారమే డీఏవో పరీక్షను నిర్వహించాలని కమిషన్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.