Vizag New Capital
త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన అని ప్రకటించారు జగన్… రాజధానిపై కేసులను త్వరగా తేల్చాలని కోరుతూ సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి లేఖ రాసిన ఆయన కోర్టు తీర్పు వరకు కూడా వేచిఉండలేకపోయారు … అసలు మూడు రాజధానులపై కేంద్ర అనుమతి కూడా తీసుకోలేదు … అయినా విశాఖే రాజధాని అన్నట్లు వ్యవహరిస్తున్నారు … దీని వల్ల ఆయనకు ఉత్తరాంధ్రలో ఒరిగింది ఏంటో కాని … అమరావతి ప్రాంత వైసిపి ప్రజాప్రతినిధులకు మాత్రం చుక్కలు కనపడుతున్నాయంట.. దానికి తోడు పెరుగుతున్న అసమ్మతితో తమ భవిష్యత్తుపై అధికారపక్ష నేతల్లో తెగ గుబులు రేగుతోందంట
విశాఖ నుంచే పరిపాలన అంటున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆ నిర్ణయం వల్ల ఉత్తరాంధ్రలో అధికార పార్టీకి కొత్తగా వచ్చిన మైలేజి ఎంతో కాని,అమరావతి రాజధాని పరిసరాల్లోని గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతల్లో ఓటమి గుబులు రేగుతోందంట, అమరావతి గురించి ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని ప్రజలు నిలదీశారు. రాజధాని విషయంలో మీ వైఖరేంటో చెప్పాలని ఉండవల్లిలో జనం ప్రశ్నించడంతో ఆయన మౌనంగా వెనుదిరగాల్సి వచ్చిందంట.సీఎం జగన్ వ్యాఖ్యలతో ఉత్తరాంధ్రలో పార్టీకి మైలేజ్పెరుగుతుందని ఆ పార్టీ నేతలు ఆశించారు.అయితే రాజధాని స్థాయి నగరంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ ప్రజలు సీఎం ప్రకటనపై పెద్దగా స్పందించినట్టు లేదు.ఒకరిద్దరు వైసీపీ మంత్రులు స్వాగతించడం తప్ప జనంలో పెద్దగా ఆ సెంటిమెంట్ కనిపించడం లేదంటున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అక్కడ సభలు, సమావేశాలు పెట్టి విశాఖ రాజధాని అవుతుందని గొంతు చించుకున్నా ఆశించిన స్పందన రావడం లేదు.
మరోవైపు అమరావతి రాజధాని పరిసర ఎమ్మెల్యేలు ప్రజల నుంచి నిరసన సెగను ఎదుర్కోవాల్సి వస్తోంది.మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకి ఒక రకంగా జనంలోకి రాలేని పరిస్థితి ఎదురైందంటున్నారు. రాజధాని తరలింపుపై జనానికి ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఇప్పటికే తల పట్టుకుంటున్నారంట….అది చాలదన్నట్లు పెరుగుతున్న అసమ్మతి అమరావతి ప్రాంతంలో వైసిపికి కొత్త తలనొప్పులు తెస్తోందంట,పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అసంతృప్తితో కనిపిస్తున్నారు.తన సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు తనను పట్టించుకోవడం లేదని మొత్తుకుంటున్నా అధిష్టానం పట్టించుకోవడం లేదని దేవరాయులు అసహనంతో ఉన్నారంట.. చిలకలూరిపేట, గురజాల ఎమ్మెల్యేలైతే ఈ సారి ఆయనకి టికెట్ దక్కకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారంట.
అలాగే మంత్రి అంబటి రాంబాబు వరుస వివాదాలతో ప్రజల్లో చులకనై మరో నియోజకవర్గం వెతుక్కునే పనిలో పడ్డారు.గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మస్తాన్వలీ తన కుమార్తె సీటు విషయం తేల్చలేదని గుర్రుగా ఉన్నారంటున్నారు.తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సొంత పార్టీ నేతలే తనకు ఎసరు పెడుతుండటంపై తీవ్రంగా రగిలిపోతున్నారంట.అటు పొన్నూరులోనూ పార్టీ రెండు ముక్కలైంది.ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.మంత్రి జోగు రమేష్ తన సెగ్మెంట్లో లేనిపోని పెత్తనం చేస్తున్నారని ఆయన రగిలిపోతున్నారు.ఇక విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనులకు రాజధాని సెగ తాకడం ఖాయమంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ రాజధానిగా సీఎం జగన్ పాలన మొదలు పెడితే అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమనే అవకాశముండడం ఆ పార్టీ పెద్దల్లో ఆందోళన రేకెత్తిస్తోందంట.గత ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేతగా జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించారు. అందుకోసం తాను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటూ నాడు ఊదరగొట్టిన జగన్ ఇప్పుడు మాట తప్పడమేంటని రాజధాని ప్రాంత ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.జగన్ అప్పుడే రాజధాని ఏర్పాటును వ్యతిరేకించి ఉంటే..ఇప్పుడు విశాఖకు రాజధాని తరలింపునకు ఓ లెక్క ఉండేది.నిజంగా మాట తప్పలేదన్న క్రెడిట్ అన్నా దక్కేదంటున్నారు.అయితే ఇప్పుడు కేవలం ఓట్ల కోసమే జగన్ మూడు రాజధానుల మంత్రం పటిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అప్పుడు చంద్రబాబు బినామీలు ముందుగా భూములు కొనుక్కొని రాజధానిని నిర్ణయించినట్లు ఆరోపించారు ఇప్పుడు జగన్ అనునూయలు విశాఖ చుట్టూ భూములు సొంతం చేసుకొని రాజధానిని తీసుకెళ్తున్నట్లు టిడిపి ఆరోపిస్తోంది.ఏదేమైనా వైసిపికి అమరావతి ప్రాంతంలో ఎదురీత తప్పే పరిస్థితి కనిపించడం లేదు.