రాష్ట్రంలో త్వరలోనే పదివేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థులు లేరని ఎక్కడా పాఠశాలలు తీసివేయడం లేదన్నారు. 317 జీవో కింద ఇతర జిల్లాలకు వెళ్లిన వారికి ప్రస్తుత బదిలీల్లో పాత జిల్లాల్లో పోస్టింగ్‌లకు అవకాశాలు ఉన్నాయన్నారు. భాషా పండితులు, ఇతర సమస్యలు కొన్ని కోర్టుల్లో ఉండటంతో పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని పేర్కొన్నారు. మన ఊరు-మన బడి మొదటిదశ కింద మరమ్మతులు చేపట్టిన 9,123 పాఠశాలలు జూన్ నాటికి సిద్ధమవుతాయని తెలిపారు. మహబూబాబాద్, కొత్తగూడెంలలో కొత్త ఇంజినీరింగ్ కళాశాలల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు, ఆంగ్ల మీడియం విద్యార్థులకు వేర్వేరుగా బోధించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యా వాలంటీర్ల వేతనాలు ట్రెజరీలో నిలిచిపోయి ఉన్నాయని పరిష్కరించాలని అడిగారు.