ప్రాథమిక సేవలన్నీ వాట్సాప్ లో:
వినియోగదారుల కోసం వాట్సాప్ లో 24 X 7 ఇంటరాక్టివ్ సేవలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ప్రారంభించింది. ‘LIC WhatsApp’ చాట్ బాట్ ద్వారా ప్లాన్‌లకు సంబంధించిన సమాచారం, ఇతర సేవలను త్వరగా యాక్సెస్ చేయడానికి పాలసీదారులకు అవకాశం ఏర్పడింది. లోన్ అర్హత, రీపేమెంట్ కోట్ లు, పాలసీ స్థితి, బోనస్, స్టేట్ మెంట్, ప్రీమియం గడువు తేదీల అప్‌డేట్‌లు, లోన్ వడ్డీ గడువు తేదీ నోటిఫికేషన్‌లు, చెల్లించిన ప్రీమియంల సర్టిఫికెట్‌లు, సర్వీసుల ఎంపిక/నిలిపివేత వంటి పలు సేవలను నేరుగా WhatsApp ద్వారా పొందవచ్చు.
హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు:
‘LIC WhatsApp’ సేవలను వినియోగించుకునేందుకు ‘+91 8976862090’ నంబరుకు ‘హాయ్’ అని వాట్సాప్ లో మెసేజ్ చేయాలి. అనంతరం 11 రకాల సేవలకు సంబంధించిన ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. కావాల్సిన సేవతో కూడని నంబరుతో రిప్లై ఇస్తే సరి. మీ అవసరానికి సంబంధించిన వివరాలను LIC షేర్ చేస్తుంది. అయితే వాట్సాప్ ద్వారా సేవలను పొందేందుకు, పాలసీదారులు ముందుగా అధికారిక సైట్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
నమోదు ఇలా..
మొదటిసారి రిజిస్ట్రేషన్ కోసం.. LIC అధికారిక వెబ్ సైట్(www.licindia.in) లోని కస్టమర్ పోర్టల్ లో ఉన్న ‘కొత్త వినియోగదారు’ ఆప్షన్ ని ఎంచుకోవాలి. యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి బేసిక్ సర్వీసెస్ లోని యాడ్ పాలసీపై క్లిక్ చేయాలి. కస్టమర్ కు కావాల్సిన పాలసీలన్నిటినీ అక్కడ నమోదు చేయాలి. ఈ విధంగా LICలో బీమా పాలసీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వాట్సాప్ సర్వీసును వినియోగించుకోవచ్చు.