జగన్ ముందస్తు వ్యూహం
వైసిపి అధిష్టానానికి అసమ్మతి పెద్ద తలనొప్పిగా తయారైందంటున్నారు … ఒకవైపు నిధుల లేమితో అభివృద్ధి కుంటుబడి జగన్ సర్కారుకు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు మామూలైపోతున్నాయి … మరోవైపు ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్న సంక్షేమ పథకాల్లో కూడా పారదర్శకత లేదన్న విమర్శలు వస్తున్నాయి … ఆ ఎఫెక్ట్ గడపగడపకు తిరుగుతున్న పలువురు ఎమ్మెల్యేలకు గట్టిగానే తగులుతోంది… ఇది చాలదన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అంశం జగన్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది .. ఈ పరిస్థితులు మరింత దిగజారితే కష్టమని.. అందుకే ముందస్తుకు వెళ్దామని పలువురు జగన్‌కు సూచిస్తున్నారంట
వై నాట్ 175 అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే అంటున్నారు … వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాల్సిందేనని ..ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నారు. అన్ని సర్వేలు అనుకూలంగానే ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది
అయితే ధీమా ఉండొచ్చు గానీ మరీ అంత అతి ఉండకూడదని రాజకీయ వర్గాల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి …. గ్రాఫ్ పడిపోతున్న వైసిపి మరీ ఎక్కువగా ఊహించుకుంది అంటున్నారు … కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు వైసీపీ గ్రాఫ్ పడిపోవడానికి కూడా చాలా కారణాలు వినిపిస్తున్నాయి … ఇప్పటి వరకు సర్వేలలో వైసీపీకి 51శాతం ఓట్లు ఉన్నాయంటున్నారు … అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా గత ఎన్నికల్లో గెలిచిన సీట్లన్ని కూడా గెలిచే పరిస్థితి లేదు
కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతోంది … రోజోకో వివాదంలో వైసీపీ ఇరుక్కుంటుంది. మరోవైపు సొంత పార్టీలో అసమ్మతి సెగలు రేపుతోంది … ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచుతున్నాయి …. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ అంశం కుదిపేస్తోంది … మరోవైపు అప్పులు వేధిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధిష్టానానికి కొందరు ముందస్తు ఎన్నికల అంశాన్ని సూచించినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే మంచిదని పలువురు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మొదటి మూడున్నరేళ్లు వైసీపీ నాన్ స్టాప్‌గా దూసుకెళ్లింది …. ఎన్నోసార్లు ఫ్యాన్ స్పీడుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించినప్పటికీ బెడిసికొట్టాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని సర్వేలు వెల్లడించాయి. మరోవైపు ప్రతీ ఆరు నెలలకోసారి వైసీపీ నాయకత్వం నిర్వహించే సర్వేలలో కూడా వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలిందంటున్నారు
దీంతో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైనాట్ 175 అనే నినాదం ఎత్తుకున్నారు …. చంద్రబాబు కంచుకోట అయిన కుప్పం కోట దగ్గర నుంచి మెుదలు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయ దుందుభి మోగించాల్సిందేనని చెప్పుకొస్తున్నారు …. పార్టీ కార్యక్రమాల్లోనూ.. బహిరంగ వేదికలపై నుంచి.. నియోజకవర్గాల సమీక్షలలోనూ వై నాట్ 175 అంటూ సీఎం జగన్ పదే పదే పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే.
ఆ క్రమంలో నిన్న మొన్నటి వరకు వైసీపీ చాలా ధీమాగా ఉంది …. 175 నియోజకవర్గాల్లో గెలుపొందుతామని గంటాపథంగా చెప్పుకొచ్చింది …. ముందస్తు అంశంపై ప్రశ్నిస్తే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఐదేళ్లు పాలిస్తామని వైసీపీ చెప్పుకొచ్చింది. ముందస్తుకు వెళ్లాల్సిన తొందరేముందని చెప్పుకొచ్చింది. ప్రజల్లో తమకు విపరీతమైన ఆదరణ ఉందని ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ స్వీప్ చేసి తీరుతామని చెప్పుకొచ్చింది. అయితే ఈ ధీమా రోజురోజుకు సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తోంది … ఒకవైపు వైసీపీలో తిరుగుబాటు అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
ఇప్పటికే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు …. మరికొందరు సైతం సమయం కోసం వేచి చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది … ఈ తిరుగుబాటు సంగతి అటు ఉంచితే అసమ్మతి మరింత తలనొప్పిగా మారింది. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు ఎంపీకి పొసగడం లేదు…. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు నియోజకవర్గ పరిశీలకులకు పడటం లేదు …. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నియోజకవర్గ పరిశీలకుడికి మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది సంగతి తెలిసిందే …. ఈ పరిస్థితి వైసీపీకి నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉందని పార్టీ నాయకులు బెంబేలెత్తుతున్నారు
అదలా ఉంటే ప్రతిపక్షాలు సైతం చాలా దూకుడు పెంచాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు … ఈ పాదయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది … దీంతో టీడీపీలో నూతనొత్తేజం మొదలైంది. అంతేకాదు ఇటీవలే నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను సైతం టీడీపీ నియమించింది. దీంతో వారంతా చాలా యాక్టివ్ అయ్యారు. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు లేకపోలేదు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం దూకుడు పెంచాలని నిర్ణయించారు. త్వరలోనే వారాహి యాత్ర చేయాలని నిర్ణయించారు. వారాహి వాహనానికి ఇప్పటికే ప్రత్యేక పూజలు సైతం చేశారు. ఆ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం అంటూ దూసుకెళ్లిపోతుంటే టీడీపీ, జనసేన పార్టీలు సైతం అంతే దూకుడుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
రాష్ట్రంలో పరిస్థితులపై ఇటీవలే వైసిపి హైకమాండ్ చర్చించిందంట .. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైసీపీకి లోలోపల మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడనీయడం లేదని తెలుస్తోంది… ఒకవైపు మూడు రాజధానులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి దుస్థితి …. మరోవైపు అసమ్మతి, తిరుగుబాటులను నియంత్రించడంలో చేతులెత్తేస్తోంది…. ఈ పరిస్థితి మున్ముందు మరింత పెరగొచ్చని వైసీపీ ఆందోళన చెందుతోందంట… ఇక ఆర్థిక కష్టాలు, అభివృద్ధి లేమి, సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి… తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశాలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు నిధుల సమీకరణ కూడా కష్టతరంగా మారుతుంది. ఇది కాస్త ప్రతిపక్షం అవకాశంగా మలచుకుంటే వారికి అస్త్రాన్ని చేతికందించినట్లే అవుతుంది. ఇలాంటి తరుణంలో ముందస్తుకు వెళ్తే ఈ అంశాలన్నింటికి ముకుతాడు వేయోచ్చని పార్టీలోని కొందరు పెద్దలు ఆలోచన చేస్తున్నారట. మరి ఈ ముందస్తుపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.