- భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించడమే ప్రధానం
- లోక్‌సభలో రాజమండ్రి ఎంపీ భరత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి సమాధానం
మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను విదేశాలలో సైతం వివరించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను భారత దేశ ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు. లోక్‌సభలో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సంబంధిత శాఖను ఉద్దేశించి అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్ ద్వారా విదేశాలలో భారత దేశ పండుగలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ సమయంలో జానపద కళలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించినట్టు చెప్పారు. ఈ పథకం కింద గ్రాంటిన్-ఎయిడ్ కూడా ‘ఇండో – పారిన్ ఫ్రెండ్ షిప్ కల్చరల్ సొసైటీలకు అందించబడుతుందని మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, విదేశీ మంత్రిత్వశాఖ కేంద్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంస్కృతిని, జానపద కళలు తదితర కళలను ప్రచారం చేయడం జరుగుతుందని వివరించారు. అంతర్జాతీయ విద్యార్థుల సందర్శనతో సహా వివిధ రంగాలలో దాని కార్యకలాపాలు, విజిటర్స్ ప్రోగ్రామ్ కింద హిందీ సబ్జెక్ట్ లో వివిధ విదేశీ విద్యాలయాలలో సపోర్టింగ్ చైర్స్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. గత అయిదు సంవత్సరాలుగా విదేశాలలో భారత దేశ పండుగలు, ఇండో ఫారిన్ ఫ్రెండ్ షిప్ సొసైటీలకు సహాయం అందించడం జరిగిందని తెలిపారు. మొత్తంపై మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, కళల వ్యాప్తికి గత అయిదు సంవత్సరాలలో దాదాపు రూ.85.65 కోట్ల నిధులు వెచ్చించినట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఎంపీ భరత్ కు తెలియజేశారు.