- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞాపన పత్రం..
- విషయం- రాష్ట్రంలో ధాన్యం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని ఆదుకోవడం గురించి..
- ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- వ్యవసాయరంగం పట్ల, అన్నదాతల సమస్యల పరిష్కారం పట్ల ఎందుకీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది?
ఈ కింది ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:
- రాష్ట్రంలో 63 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో సగానికి పైగా రైతులు వరి సేద్యం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది? ధాన్యం దిగుబడి దాదాపు 90 లక్షల టన్నులు కాగా ప్రభుత్వం ఇప్పటివరకు 29 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. మిగిలిన పంటను మద్దతు ధరకు కాకుండా అయినకాడికి రైతులు బయటి వ్యాపారులకు విక్రయించుకునే పరిస్థితి ఎందుకొచ్చింది?
- గత ప్రభుత్వంలో ధాన్యం విక్రయించిన వారంలోగా రైతులకు నగదు చెల్లించడం జరిగింది. నేడు ధాన్యం బకాయిల చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం ఎందుకు జరుగుతోంది?
- ఈ-క్రాప్ నమోదు పేరుతో కౌలు రైతులు మద్దతు ధరకు తమ ధాన్యం అమ్ముకోకుండా దగా చేస్తున్నారు.
- తెలంగాణ ప్రభుత్వం 2020-21 ఏడాదిలో కోటి 24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 2021-22 ఏడాది కోటి 44 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలు చేసిన మూడో రోజే రైతుల అకౌంట్లలో నగదు జమచేస్తోంది. రాష్ట్రంలో మాత్రం ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 37 లక్షల టన్నులకు కుదించారు. ఇప్పుడు 33 లక్షల టన్నులే సేకరిస్తామంటున్నారు
- సీఏసీపీ నివేదిక ప్రకారం దేశంలోనే రైతులకు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ లభించిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరలో దాదాపు 11 శాతం తక్కువ రైతులకు దక్కింది. క్వింటా ధాన్యానికి ప్రతి రైతు రూ.230 నష్టపోయారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ నాలుగేళ్లలో రైతులు నష్టపోయిన మొత్తం సుమారు రూ.60వేల కోట్లు.
- ధాన్యం రైతులను తేమ, తరుగు పేరుతో దోచుకుంటుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?
- వ్యవసాయరంగానికి 2020-21లో రూ.20 వేల కోట్లు బడ్జెట్ కేటాయించి అందులో మూడో వంతు, అంటే రూ.7 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టడం రైతుల సంక్షేమం పట్ల మీకు ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది.
- వ్యవసాయరంగంలో కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసి రైతులను దగా చేస్తున్నారు. మైక్రో ఇరిగేషన్ కింద కేంద్రం 60శాతం సబ్సీడీ ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించకుండా నిర్లక్యం వహించింది. చంద్రబాబు గారి హయాంలో మైక్రో ఇరిగేషన్ పరికరాలపై 90శాతం సబ్సీడీని 10 ఎకరాల రైతు వరకు ఇవ్వగా.. నేడు 5 ఎకరాలకు కుదించారు. నాలుగేళ్లుగా ఇది కూడా రైతులకు ఎక్కడా అందడం లేదు.
- 2018లో రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ కింద రూ.1,250 కోట్లు ఖర్చు చేసి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో నిలిచింది. నేడు అట్టడుగున ఉంది.
- రాష్ట్ర ప్రభుత్వం భూసార పరీక్షలను ఎందుకు నిలిపివేసింది? సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేయడం లేదు. చంద్రబాబు గారి హయాంలో 100శాతం సబ్సీడీపై మైక్రో న్యూట్రియంట్స్ అయిన జిప్సం, బోరాన్, జింక్ పంపిణీ చేయగా.. నేడు పూర్తిగా నిలిపివేశారు. ఇతర పురుగుమందులు, కలుపు మందులు, గడ్డిమందులు గత ప్రభుత్వంలో 50శాతం సబ్సీడీపై అందించగా… నేడు పూర్తిగా నిలిపివేశారు. దీంతో రైతులకు పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గింది.
- రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే యాంత్రీకరణ పథకం కింద 2018లో రూ.650 కోట్లు ఖర్చు చేయగా.. నేడు ఖర్చు పెట్టింది సున్నా. ఒక్క చిన్న స్ప్రేయర్ గాని, పట్ట గాని రైతులకు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఎందుకుంది?
- చంద్రబాబు గారి హయాంలో ఏడాదికి 12 వేల ట్రాక్టర్లు రైతు రథం పథకం కింద అన్నదాతలకు అందించారు. నేడు వ్యవసాయ యాంత్రీకరణను నిర్లక్షం చేశారు.
- వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించి నేడు రైతుల పాలిట ప్రేతకళగా మార్చారు.
- నాడు విద్యుత్ ఆదా కోసం సోలార్ పంపు సెట్లు ఉచితంగా అందజేయగా.. నేడు ఎందుకు నిలిపివేశారు? నాడు పాత మోటార్ల స్థానంలో రైతులకు ఉచితంగా ఐఎస్ఐ మోటార్లను అందించగా.. నేడు ఆ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు?
- వ్యవసాయరంగంలో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, సబ్సీడీలను ఎత్తివేసి, వేల కోట్ల ఖర్చుతో మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?
- 16. రాష్ట్రంలో అనేక కష్టాల్లో ఉన్న రైతుల్ని పలకరించలేని దుస్థితిలో మీ వ్యవసాయ, సివిల్ సప్లై మంత్రులు ఉండటం దురదృష్టకరం.
- రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రికల్చర్ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
- అన్నదాతల సమస్యలు పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి స్టీరింగ్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
- ఈ సమావేశంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, కూన రవికుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.