- జగన్ విశాఖకు వెళితే మారనున్నది ఆయన ఇంటి చిరునామానే అంతేకానీ రాజధాని మార్పు అనేది అసాధ్యం
- సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న రోజే న్యాయస్థానాలను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
- వైఎస్ వివేక హత్య అనంతరం మా పార్టీ అంతఃపురానికి ఫోను వెళ్లినట్టు సమాచారం
- సాక్షి దినపత్రిక మినహా ప్రముఖ దినపత్రికలన్నీ అదే కథనాన్ని ప్రముఖంగా ప్రచురించాయి
- ఫోన్ టాపింగ్ చట్టవిరుద్ధం… గతంలో ప్రభుత్వాలే కూలాయి- నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ప్రత్యేక హోదా, బడ్జెట్ ప్రొవిజన్ ను సాకుగా చూపెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని గుమ్మాల ఎక్కి దిగిన ప్రయోజనం శూన్యం… కేంద్ర ప్రభుత్వ పెద్దలు సహకరించే అవకాశమే లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు కుండబద్దలు కొట్టారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డిని విచారించిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ లోని అతి కీలకమైన వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు సాక్షి దినపత్రిక మినహా, అన్ని వార్తా దినపత్రికలు ప్రముఖంగా కథనాన్ని ప్రచురించాయి. ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలను కలిసి తమపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని భావించే కాబోలు, సిబిఐ అధికారులు ఈ విషయాన్ని పత్రికలకు లీక్ చేసి ఉంటారు. నవీన్ ఫోన్ ద్వారా జరిపిన సంభాషణల గురించి సిబిఐ అధికారులు ఒకవేళ చూసి చూడనట్లు వ్యవహరించిన , తనలాంటివారు ఆ వ్యవహారాన్ని అంత తేలికగా వదలరని తేల్చి చెప్పారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజదోషులెవరో తేలే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో పై స్థాయి వ్యక్తులపై చర్యలు ఉండకపోయినా, ఒక స్థాయి కలిగిన వారిపై చర్యలు ఉండే అవకాశం ఉందన్నారు. ఒకవేళ వారిపై కూడా చర్యలు తీసుకోకపోతే , తన లాంటి వారు ఈ కేసు పూర్వాపరాలను ఆరా తీసి, పరిశీలిస్తారు . మమ్మల్ని ఎంతగానో చిత్రహింసలకు గురి చేసినప్పుడు అది మా బాధ్యత అని రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు.
మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఢిల్లీలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను విశాఖపట్టణానికి మకాం మార్చనున్నట్లు , అక్కడికి పారిశ్రామికవేత్తలను తరలి రావాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణానికి మకాం మార్చితే, ఆయన ఇంటి చిరునామా మారుతుంది తప్పితే, రాజధాని మారదని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.
న్యాయస్థానాలను, రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తులు ముఖ్యమంత్రి పదవికి అనర్హులు
న్యాయస్థానాలను, రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అనర్హులని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో కేసు విచారణకు ఉన్న రోజే న్యాయస్థానాలను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యం, జ్ఞాన శూన్యత అనుకోవాలా?, విశృంకలత్వం అనుకోవాలా??, ఇంకేమైనా అనుకోవాలా??? అని ప్రశ్నించారు. గతంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ వంటి వారు రాజధాని మార్పు గురించి మాట్లాడితే అమర్నాథ్ వంటి వారికి తెలియనితనమని సర్దుకుపోవచ్చు. ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు మాట్లాడితే ఏమనుకోవాలి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలి. సుప్రీంకోర్టులో విచారణకు రానున్న రోజే ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల ఆయనకున్న అవగాహన రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి . సాక్షి దినపత్రిక లో మినహా అన్ని ప్రముఖ తెలుగు దినపత్రికలలో ప్రచురించిన వార్తా కథనం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తాను విశాఖకు తరలి వెళుతున్నట్లుగా చెప్పాలన్నది ఆయన వ్యూహం అయి ఉంటుంది. ఇప్పటివరకు ఇతరులతో మాట్లాడించి ఆనందించే వ్యక్తి, ఇప్పుడు నేరుగా తానే మాట్లాడడం పరిశీలిస్తే పొగరు బోతుతనంతో మాట్లాడినట్లుగా స్పష్టమవుతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
Contents
న్యాయవ్యవస్థపై గౌరవం సన్నగిల్లే ప్రమాదం
జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గతంలో తాను సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ కోర్టు న్యాయమూర్తి తీర్పును వెలువరించకముందే సాక్షి దినపత్రికలో బెయిల్ పిటిషన్ రద్దు అంటూ వార్తా కథనాన్ని ప్రచురించారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. ఆ తరువాత సాక్షి దినపత్రికలో రాసినట్లుగానే న్యాయస్థానం తీర్పును వెలువరించింది. జగన్మోహన్ రెడ్డి వంటి వారి వల్ల రాజకీయ నాయకులంటే గౌరవం తగ్గుతోంది. న్యాయస్థానాలంటే ఇప్పటికీ ప్రజలకు ఎనలేని గౌరవం ఉంది. ఒకవేళ న్యాయస్థానం కూడా రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తుగ్లక్ నిర్ణయాన్ని సమర్ధిస్తే, ప్రజల్లో న్యాయవ్యవస్థ పై కూడా అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉంది. అమరావతి రాష్ట్ర రాజధాని అని ఇప్పటికే హైకోర్టు ధ్రువీకరించింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు. ఆరు నెలల వ్యవధిలో రాజధాని నిర్మాణం అసాధ్యమని భావించి, మినహాయింపులను మాత్రమే ఇచ్చింది. పారిశ్రామికవేతల సదస్సులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ ను జతచేస్తూ, తాను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశాను. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయన్నది తన భావన. అదే విషయాన్ని తాను తెలియజేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడడమే కాకుండా తమ పార్టీ వారి చేత కూడా మాట్లాడించారు. లేఖలను రాయించారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థను తమ ప్రభుత్వం గౌరవించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోసం తీవ్ర ప్రయత్నాలు
ఢిల్లీలో పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేసినట్లు బ్లూ మీడియా కథనాల ద్వారా స్పష్టమవుతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రత్యేక హోదా, బడ్జెట్లో ప్రొవిజన్స్ గురించి మాట్లాడాలని కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడనున్నారో తెలిసిన కేంద్ర పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఈ క్షణం వరకు నిరాకరించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన రోజు తెల్లవారుజామున ఒక ప్రత్యేక నెంబర్ కు ఎందుకనీ 190 సార్లు ఫోను చేశావంటూ సిబిఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఎందుకని అన్ని ఫోన్ కాల్స్ చేయవలసిన అవసరం వచ్చిందని ఆయన్ని నిలదీసినట్లు పత్రికల కథనాలలో పేర్కొనడం జరిగింది. మూడున్నర గంటలకు హత్య జరిగినట్లు సమాచారం అందితే, ఆరు గంటల వరకు సంఘటనా స్థలానికి రాకపోవడానికి వెనుకనున్న కారణం ఏమిటంటూ అవినాష్ రెడ్డి పై సిబిఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడం తో, తాను మాట్లాడిన వ్యక్తి పేరు నవీన్ అని, అతనిది కడప జిల్లా చక్రాయపేట అని పేర్కొన్నట్లుగా సమాచారం. నవీన్ అనే వ్యక్తి అనధికారికంగా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డికి వ్యక్తిగత సహాయకుడని తెలిసింది. అయితే అతను అధికారికంగా తాడేపల్లి ప్యాలెస్ లో విధులు నిర్వహించే మరొకరి వద్ద పిఏ గా పనిచేస్తున్నట్లు సమాచారం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఒకే ఫోన్ నుండే కాకుండా, అవినాష్ రెడ్డికి మరొక ఫోన్ నుంచి కూడా ఫోన్ కాల్ వచ్చినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ఆ ఫోన్ కాల్ నేరుగా రాచనగర్ కొలువు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. సిబిఐ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న తర్వాత ఇన్నాళ్లకు కాల్ డేటాను సేకరించి విచారణను ప్రారంభించడం శుభ పరిణామమని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
తనకు సిట్ నోటీసులు ఇవ్వకముందే హడావుడి
తెలంగాణ సిట్ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వకముందే, నోటీసులు ఇచ్చినట్లుగా సాక్షి దినపత్రిక హడావిడి చేసిందని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. తనకు సంబంధమే లేని వ్యవహారంలో తనని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించారు. ఒక హిందువుగా స్వామీజీ కనిపిస్తే తాను దండం పెట్టుకోవడం సర్వసాధారణం. అలాగే ఎవరైనా ఫోటో దిగమని అడిగితే దిగడం సహాజమే. తనపై అక్రమ కేసులు బనాయించి లాకప్ లో చిత్రహింసలకు గురిచేసి, పోలీస్ కస్టడీలోని అంతమొందించాలని చూశారు. ప్రస్తుతం తనని ఎవరైతే చిత్రహింసలకు గురి చేశారో, వారు అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు ఆ వ్యవహారంపై తాను కచ్చితంగా మాట్లాడుతానని చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నవీన్ తో పాటు, వైయస్ అవినాష్ రెడ్డి ని మరొకసారి సిబిఐ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు..
సీఎంకు నువ్వు తొత్తువు కావొచ్చు… మేం కాదు
ముఖ్యమంత్రికి ఐపీఎస్ అధికారి తొత్తు కావొచ్చు. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తొత్తులు కాదు. ముఖ్యమంత్రికి, ఐపీఎస్ అధికారులకు ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా తొత్తులు కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. ప్రజా ప్రతినిధుల కింద అధికారులు పనిచేస్తున్నారా?, అధికారుల కింద ప్రజాప్రతినిధులు పని చేస్తారా?? అంటూ రఘురామకృష్ణం రాజు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలకంగా పనిచేసిన అధికారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్ రెడ్డి ఫోన్ టాప్ చేసిన సదరు ఐపీఎస్ అధికారి, ఆయన మాట్లాడిన తీరు పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ హెచ్చరిక చేయబోతే శ్రీధర్ రెడ్డి ఏమి చేస్తారో చేసుకోమ్మంటూ తిరగబడినట్లు తెలిసిందన్నారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లుగా టెలిఫోన్ టాపింగ్ వ్యవహారం లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉండి ఉంటుంది. టెలిఫోన్ టాపింగ్ అనేది చట్ట విరుద్ధమైన ప్రక్రియ. గతంలో టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంలో రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం కూలిపోయింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేవలం ఇద్దరు ఐపీఎస్ అధికారులతోనే సరి పెట్టకుండా , ఈ వ్యవహారాన్ని మరింత ముందుకు తీసుకు వెళితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బందులు తప్పవు. గతంలో తాను కూడా టెలిఫోన్ టాప్ వ్యవహారం గురించి మాట్లాడితే… మా పార్టీలోనే చాలామంది విశ్వసించలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు ఆ అనుభవం ఎదురయింది. తనలాగే ఆనం రామనారాయణ రెడ్డికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో తాను శాసన సభ్యుడిని కాకపోయినప్పటికీ, తనకు అధిక సెక్యూరిటీని కల్పించారని , ప్రస్తుతం శాసనసభ్యుడినైనప్పటికీ సెక్యూరిటీని తగ్గించడం పట్ల ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రతి ఒక్కరూ గౌరవాన్ని కోరుకుంటారు. వారి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే నొచ్చు కుంటారు. అది తెలిసి తెలియని తనంతో అయితే క్షమిస్తారు కానీ అహంకారంతో అమర్యాదగా ప్రవర్తిస్తే ఎవరు కూడా తట్టుకోలేరని పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.
సునీల్ కుమార్ ఒక మూర్ఖుడు
డీజీపీగా పదోన్నతి పొంది, ఏపీ సిఐడి చీఫ్ గా ఉద్వాసనకు గురైన పీవీ సునీల్ కుమార్ తన దృష్టిలో ఒక మూర్ఖుడు అని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఏపీ సిఐడి చీఫ్ గా సునీల్ కుమార్ ను తప్పించి , సంజయ్ ను నియమించడం పట్ల ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాను. అలాగే విజయ్ పాల్ అనే మరొక రిటైర్డ్ అధికారికి తమ ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగించింది. ఇప్పుడు అతన్ని కూడా ఏపీ సిఐడి విభాగం నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. పనికిరాని అధికారులను పక్కన పెట్టినందుకు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.