వడ్డెర సామాజిక వర్గానికి రాజకీయంగా అవకాశాలు కల్పించి పైకి తీసుకొస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ వర్గానికి ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారు. నాలుగోరోజు ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా ఆయన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారితో సమావేశమై.. వారి సమస్యలను ఆలకించారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా ఆ సామాజిక వర్గం కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. అధికారంలోకి రాగానే అండగా నిలుస్తామని వారికి భరోసా ఇచ్చారు.
నాలుగోరోజు కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లె నుంచి ప్రారంభమై పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దారి పొడవునా ప్రజలతో లోకేశ్ మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. పలుచోట్ల లోకేశ్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు విద్యార్థులు, యువత పోటీపడ్డారు. వి.కోట మండంలోని చెక్‌పోస్టు కూడలిలో భారీ గజమాలతో తెదేపా శ్రేణులు యువనేతకు స్వాగతం పలికారు. చెల్దిగానిపల్లె నుంచి పలమనేరు నియోజకవర్గంలోకి వెళ్లే మార్గంలో కొంత ప్రాంతం కర్ణాటక పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులు పాదయాత్రకు భద్రత కల్పించారు. సోమవారం రాత్రి కృష్ణాపురం టోల్‌గేట్ సమీపంలో లోకేశ్ బస చేయనున్నారు.