- ఎన్నికల తర్వాతే జనగణన..
- మరోసారి వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం
2021లో జరగాల్సిన దేశవ్యాప్త జనగణన ప్రక్రియను 2024కు వాయిదా వేస్తూ కేంద్ర సర్కార్ గతవారం విధానపరమైన నిర్ణయం తీసుకొన్నది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం 2024, జూలై తర్వాతనే జనగణన ఉండే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. దీని వెనుక బీజేపీ రాజకీయ కారణాలు దాగివున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో కులాల వారీగా లెక్కలు తేల్చేందుకు కులగణన చేపట్టాలని బీహార్‌లోని నితీశ్ సర్కార్‌తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఏడాది 10 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల తర్వాతనే జనగణన చేపట్టాలనే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్టు తెలుస్తున్నది.
150 ఏండ్లలో తొలిసారిగా..
ప్రతి 10 ఏండ్లకోసారి జరుగుతున్న జనాభా లెక్కలు 150 ఏండ్ల చరిత్రలో తొలిసారిగా వాయిదా పడ్డాయి. కేంద్ర బడ్జెట్-2022లో నిధులు కూడా కేటాయించింది. ఈ సారి నిర్వహించనున్న జనగణన పూర్తిగా డిజిటల్ ప్రక్రియ. ఇందుకు ఒక అప్లికేషన్, వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు.సెప్టెంబర్ 30 వరకు పొడగింపు జనగణన వాయిదాకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కమిషనర్ అన్ని రాష్ర్టాలకు సమాచారం చేరవేశారు. పాలనాపరమైన పరిమితులపై విధించిన నిషేధాన్ని ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు అందులో పేర్కొన్నది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పాలనా యూనిట్ల సరిహద్దు ఫ్రీజింగ్ ముగిసిన మూడు నెలల తర్వాత జనగణన నిర్వహించాల్సి ఉంటుంది.