- ప్రతిపక్షాలను హింసించే దుష్టచట్టం జీవో నెంబర్ వన్.
- అప్రజాస్వామిక జీవోను బేషరతుగా వెనక్కు తీసుకోవాలి.
- జీవో నెంబర్ వన్ పై కదం తొక్కిన ప్రతిపక్షాలు-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
ప్రజాస్వామిక హక్కులను కాలరాసే దుష్టచట్టం జీవో నెంబర్ వన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బేషరతుగా ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే రామక్రిష్ణ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఏ ఇతర పార్టీలు, ప్రజా, కార్మిక, కర్షక సంఘాలు, పౌర హక్కుల నాయకులు సభలు,సమావేశాలు, ర్యాలీలు తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదంటూ ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ వన్ పై గురువారం అనంతలో వైసిపి మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు , ప్రజా తంత్ర వాదులు అర్ధనగ్న ప్రదర్శనతో తమ నిరసన గళాన్ని వినిపించాయి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ, కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దాదాగాంధి,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సరిపూటి రమణ, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సి అభ్యర్థి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ముందుగా జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఎదురుగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సప్తగిరి సర్కిల్ కార్పోరేషన్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రామక్రిష్ణ మాట్లాడుతూ ఏపిలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అడ్రస్ లేకుండా పోయిందని విమర్శించారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలను హింసించే రీతిలో జీవో నెంబర్ వన్ పేరుతో దుష్ట చట్టాన్ని
తెచ్చి ప్రజాస్వామిక హక్కులను హరించేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిఎం జగన్ జారీ చేసిన చీకటి చట్టం అన్ని రాజకీయ పార్టీలు,వామపక్షాలు, ప్రజాసంఘాలు, ట్రేడ్ యూనియన్లు,రైతు, విద్యార్థి, యువజన సంఘాలను ఇబ్బందులకు గురిచేసేందుకే తీసుకు వచ్చాడని ఏకరువు పెట్టారు.దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయ్యిందని 1950 లో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా ప్రజలు స్వేచ్చగా నిరసన వ్యక్తం చేయడానికి, పర్యటనలు,ఊరేగింపులు సమావేశాలు పెట్టుకోడానికి వీలు లేకుండా దుష్ట జీవో తెచ్చి పోలీసులకు పూర్తి స్థాయిలో అధికారాలిచ్చాడని మండిపడ్డారు. సీఎం జగన్ మూడున్నరేళ్లుగా ప్రజా తంత్ర ఉద్యమాలకు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడని తూర్పార బట్టారు.ప్రజా స్వామ్య వాదులను గృహనిర్బంధాలు, అరెస్టులు చేయడమే కాకుండా ఎక్కడికక్కడ వారి కార్యక్రమాలను అడ్డుకోవడం జగన్ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. జగన్ తెచ్చిన దుష్ట జీవో ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయని స్పష్టం చేశారు. ఏపిలో సీఎం జగన్ విడుదల చేసిన జీవో నెంబర్ వన్ ను హైకోర్టు సస్పెండ్ చేసిందని దానిపై వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినా సీఎం జగన్ కు చుక్కెదురైందని ఎద్దేవా చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం జీవో నెంబర్ వన్ పై వైసీపీ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిందిని ఘాటుగా విమర్శించారు.ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతి కార్యక్రమాన్ని సీఎం జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఛలో అసెంబ్లీ, ఛలో విజయవాడ కార్యక్రమాలను జరగనివ్వకుండా ఆంక్షలు విధించి అరెస్టులు చేయించడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.చీకటి జీవో నెంబర్ వన్ ను జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోని పక్షంలో సమైక్య ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. సీఎం జగన్ తన వైఖరిని మార్చుకొని జీవో నెంబర్ వన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించి చీకటి జీవోను రద్దు చేసేలా సమైక్య పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణ స్వామి, మల్లికార్జున,కార్యవర్గ సభ్యులు రాజారెడ్డి, శ్రీరాములు,రమణ,నారాయణస్వామి, రాజేష్ గౌడ్,ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుల్లాయ్ స్వామి,చిరంజీవి, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్ కుమార్, సంతోష్ కుమార్,నాయకులు అల్లిపిరా,శ్రీనివాసులు,రామాంజనేయులు,జయలక్ష్మి, కుర్శిద, మల్లికార్జున,
సిపిఎం నాయకులు నాగేంద్ర, రామిరెడ్డి, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు శివ, పరమేష్, కాంగ్రెస్ ఎస్సి సెల్ నాయకుడు శంకర్,తెలుగుదేశం పార్టీ నాయకులు మారుతి కుమార్ గౌడ్, వైసిపి మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.