తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీకి సిద్ధం అని, మాతో పొత్తుకు ఎవరైనా వస్తే సంతోషం గా భావిస్తాం. బీజేపీ వచ్చినా సరే ఓకే అని పవన్ తెలిపారు. కానీ ఏర్పడే పొత్తు తెలంగాణ రాష్ట్ర క్షేమానికి సరైనదైతేనే ఆలోచిద్దాం. జనసేన అభ్యర్ధుల గెలుపు కోసం ప్రతి నియోజకవర్గాల్లో నేనే తిరుగుతా అది నా బాధ్యతగా భావిస్తున్నాను. ఏపీలో నేను ఎదుర్కొంటున్న నాయకులు మామూలోళ్లు కాదు వాళ్ళు సొంత బాబాయినే చంపేసుకునే వాళ్లు. ఏపీలో ప్రజాస్వామ్యానికి విలువ లేదు అని తెలంగాణ కార్యనిర్వాహకుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీలో జనసేన పార్టీ సభ్యులు ఉండాలి.. అందుకోసం పోరాటం చేద్దామని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అవకాశాన్ని బట్టి ఏడు నుంచి 14 అసెంబ్లీ స్థానాలు, పరిమిత సంఖ్యలో లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు. ఈ రోజు ఎన్నికల ప్రకటన వచ్చినా పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రజలు మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే భుజం కాయడానికి వచ్చామని చెప్పాలని తెలిపారు. ఆ క్రమంలో ఎవరైనా పొత్తుకి వస్తే సంతోషమని.. అయితే అది జనసేన భావజాలనికి, తెలంగాణ రాష్ట్ర క్షేమానికి సరైంది అనుకుంటేనే ఆలోచిద్దామన్నారు.