అరక్కోణంలో ఘోర ప్రమాదం జరిగింది. రాణిపేట జిల్లా కిలివీడి మాండియమ్మన్ ఆలయంలో భక్తులపై కుప్పకూలింది ఓ భారీ క్రేన్.ఈ ప్రమాదంలో ఓ బాలిక సహా ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పున్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మైలార్ ఉత్సవాల్లో జరిగింది ఈ విషాద ఘటన. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దాదాపు 1500 మంది భక్తులు ఉన్నారు. ఈ క్రేన్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారగా.. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.రాణిపేట జిల్లా నెమిలి వట్టం కిలివీధి గ్రామంలోని ద్రౌపది ఆలయంలో మైలార్ ఉత్సవం జరుగుతోంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా పండుగ సందర్భంగా క్రేన్ బోల్తా పడి ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. క్రేన్ ద్వారా అమ్మవారికి పూలమాలలు వేసేందుకు ప్రయత్నించారు. అయితే పూలమాలలు వేస్తుండగా క్రేన్ ముందు భాగం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులపై క్రేన్ పడిపోయింది.